What is Montha Cyclone? ఏపీకి ‘మొంథా’ ముప్పు హెచ్చరిక .. రెడ్ అలర్ట్ అంటూ పవన్ కల్యాణ్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి, పలు జిల్లాలను తుఫాన్ మొంథా ప్రమాదం వెంటాడుతున్నది. రానున్న కొన్ని గంటలపాటు కొనసాగే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని అధికారుల బృందం తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలి. 24 గంటలపాటు పర్యవేక్షణ తప్పనిసరి అని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాన్‌కు మొంథా అని థాయ్‌లాండ్ వాతావరణ నిపుణులు నామకరణం చేశారు. మొంథా అంటే సువాసన వెదజల్లే పుష్పం లేదా అందమైన పువ్వు అని అర్థం. ఈ తుఫాన్ ముప్పు గురించిన వివరాల్లోకి వెళితే..
కాకినాడ ప్రాంతంలో మొంథా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలి. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉండనున్నది. కాబట్టి అదికారులు, ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలి. వృద్ధులు, గర్బిణులు, బాలింతలు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస ప్రాంతాలకు తరలించాలి అని పవన్ కల్యాణ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

మొంథా తుఫాన్ ముప్పు ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు, అత్యవసర సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలి. హాస్పిటల్‌లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలి. ముప్పు ఉన్న మండలాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పీ నారాయణతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వమించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లోని అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే గుర్తించిన 260 పునరావాస కేంద్రాలను గుర్తించి వాటిలో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణి స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని పవన్ కల్యాణ్ ఆదేశించగా.. ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రజా రవాణ వ్యవస్థ, కమ్యూనికేషన్ల వ్యవస్థ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా అధికారులకు సమాచారాన్ని చేరవేయాలి. తహసీల్దార్లు, వీర్వోలు అందుబాటులో ఉండాలి. పోలీసులు.. ముంపు ప్రాంతాల్లో భద్రత చర్యల పర్యవేక్షణ పెంచాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. మత్స్యకారుల బోట్లు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కూరగాయలు, నిత్యవసర సరకుల సరఫరాకు అడ్డంకులు లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి అని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
మొంథా తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలకు సహాయక చర్యలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 19 కోట్ల విడుదల చేసింది. అందులో కాకినాడ జిల్లాకు కోటి రూపాయిలు కేటాయించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలడం, దెబ్బ తినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాల"ని దిశానిర్దేశం చేశారు అని అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications











