పవన్‌తో అనవసరంగా పెట్టుకున్నాం.. ఎవరెలా పోతే జగన్‌కెందుకు : వైసీపీ నేత హాట్ కామెంట్స్
వైనాట్ 175 అనేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం. గట్టిగా కష్టపడితే ఈ ఫిగర్ పెద్ద కష్టమేమీ కాదని ఆయన శ్రేణుల్లో నూరిపోశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో జనం జగన్‌కు కర్రు కాల్చి వాతపెట్టారు. వైనాట్ 175 అన్న పార్టీకి ప్రతిపక్షహోదా కూడా దక్కకుండా కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. రిజల్ట్స్ చూసి స్వయంగా జగన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయలేదని .. అయినా తనను జనం ఎందుకు తిరస్కరించారో అర్ధం కావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. అక్రమ కేసులు, వేధింపులు, కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకపోవడం, టీడీపీ వర్గీయుల వ్యాపారాలకు అడ్డంకులు సృష్టించడం.. ఇలా ఆ పార్టీ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మార్చివేసింది. అప్పటి వరకు వైసీపీ స్వింగ్‌లో ఉండగా.. బాబు అరెస్ట్‌తో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

అన్నింటిలోకి జగన్ చేసిన ఘోర తప్పిదం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టడం, ఆయన ఛరిష్మాను తక్కువ చేసి చూడటం. నువ్వు సింగిల్‌గా పోటీ చేయలేవు.. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్‌ను వైసీపీ నేతలు దూర్భాషలాడేవారు. సీఎం, పార్టీ అధినేత హోదాలో ఇలాంటివి తప్పు అని వారించాల్సిందిపోయి జగన్ సైతం వేదికలపై పవన్‌ను వ్యక్తిగతంగా దూషించేవారు. ఆయన సభలు, సమావేశాలకు ఆటంకాలు కలిగించడం.. చంద్రబాబును పరామర్శించేందుకు వస్తుండగా అర్ధరాత్రి అడ్డుకోవడం తదితర పరిణామాలు పవన్ అహాన్ని రెచ్చగొట్టాయి. దీంతో జగన్‌ను అథ: పాతాళానికి తొక్కేస్తానని శపథం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులోనే టీడీపీతో పొత్తు ప్రకటన చేయడంతో పాటు కూటమిలోకి బీజేపీని లాక్కొచ్చారు. తన వాడి వేడి విమర్శలతో వైసీపీని ఇరుకునపెట్టి, ఓటర్లను ఆలోచింపజేశారు. పవన్ కళ్యాణ్‌ను చూసే కాపులు, మెగా అభిమానులు గంపగుత్తగా తమ ఓట్లన్నీ కూటమికి గుద్దారు. ఫలితంగా చాలా చోట్ల వైసీపీ అడ్రస్ గల్లంతయ్యింది. హేమాహేమీలైన నేతలు ఓడిపోగా.. కంచుకోటలు బద్దలయ్యాయి. ఇదంతా పవన్‌ను రెచ్చగొట్టిన ఫలితమేనని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు.

తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాలకు అడ్డంకులు సృష్టించే క్రమంలో జగన్ మోహన్ రెడ్డి.. టికెట్ రేట్లు తగ్గించి, ఇండస్ట్రీ జోలికి వెళ్లారన్నది అందరూ అంగీకరించేమాట. ఇదే విషయంపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. టికెట్ రేట్లు ఎలా ఉంటే మనకెందుకు, సినిమావాళ్ల వల్లే వైసీపీ ఓడిపోయిందన్నారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినా అది జనానికి ఎక్కలేదని.. ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాలకు ఎంత ఖర్చు పెట్టుకుని అయినా బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని చూస్తారని తెలిపారు. వాళ్లకు లేని బాధ మనకెందుకు, సినిమా వాళ్ల వల్ల అందరికీ దూరమయ్యామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











