‘పవన్ వల్లే వైఎస్ జగన్ పతనం.. ఎవరి తలరాతనైన తలకిందులు చేసే సత్తా పవర్ స్టార్‌కే’
గడిచిన ఏడాది కాలంగా ఈసారి ఏపీలో ఎవరు గెలవబోతున్నారు.. మళ్లీ జగనేనా, లేదంటే బాబు దూసుకొస్తాడా, కాదు కాదు పవన్ సత్తా చాటుతాడు చూడు ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తరుణం రానే వచ్చింది.. జగన్ సింగిల్‌గా, చంద్రబాబు.. పవన్, మోడీల సపోర్ట్‌తో ఎన్నికల రణరంగంలో దిగారు. ఇరుపక్షాలు సర్వశక్తులు ఒడ్డి ఢీకొట్టుకోగా విజయం కూటమినే వరించింది.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి చరిత్ర లిఖించిన జగన్ పార్టీ ఈసారి ప్రతిపక్ష హోదాకే దిక్కులేక అడ్రస్ గల్లంతయ్యింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. కూటమి విజయానికి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు, పలు అంశాలు దోహదం కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవన్ కళ్యాణ్. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న జనసేనాని చెప్పినట్లుగానే వైసీపీని మట్టికరిపించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించి బయటకు వస్తూనే ఇకపై టీడీపీతో కలిసి జనసేన సాగుతుందని పొత్తు ప్రకటన చేశారు. 50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. బీజేపీని కూటమిలో భాగం చేయాలనే ఉద్దేశంతో తనకు కేటాయించిన సీట్లను సైతం వదలుకుని త్యాగశీలి అనిపించుకున్నారు. అనంతరం కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా కాకుండా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా మారిపోయాయి.
తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటంలను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ . కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలోనూ పవన్ కీలకంగా మారారు.

ఈ నేపథ్యంలో జనసేనానిపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్‌ను ''తుఫాన్'' అని వ్యాఖ్యానించారంటే జనసేనాని సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ అంటే గాలి, మామూలు గాలి కాదు, పెను తుఫాన్ ప్రధాని అన్నారు.
ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. చిరు , పవన్‌లను ఆలింగనం చేసుకుని ఫోటోలు దిగారు. కారణం ఏంటంటే.. పవన్ తాపత్రయపడకుంటే ఈ కూటమి రూపుదిద్దుకునేదే కాదు. బీజేపీ రాకపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వచ్చిన నష్టమేమీ లేదు. బీజేపీతో పొత్తు లేకుండా ఉండి ఉంటే ఒకటి రెండు సీట్లు పెరిగేవేమో. మోడీకి మాత్రం ఈ కూటమి లేకుంటే ఏమయ్యేదో రిజల్ట్స్ వచ్చాక అర్ధమైంది. జగన్ పతనం పవన్ కల్యాణ్ వల్లే.. ఆయన ఎవరి తలరాతైనా తిరగరాసే శక్తి ఆయనకు ఉందని అన్నారు.
'' ఎన్డీయే గెలిచిన 293లో ఏపీలో కూటమి గెలిచిన 21 తీసేస్తే.. మోడీ ప్రధాని అయ్యేవారా లేదా అన్న అనుమానాలు వచ్చేవి. ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టే.. మోడీ సునాయాసంగా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అందుకే పార్లమెంట్ బిల్డింగ్‌లో జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్‌ను మోడీ పొగిడారు, ఇక్కడ కూడా చిరంజీవి-పవన్ కళ్యాణ్‌లతో ఫోటోలు దిగారు. ఆ రోజున పవన్ కళ్యాణ్.. మోడీ కాళ్లావేళ్లా పడ్డాడో, కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో గానీ పవన్ మాటను అంగీకరించకపోయుంటే ఇవాళ నా పరిస్ధితి ఎలా ఉండేదోనని మోడీ గ్రహించారు.
కూటమి కోసం నేను ఎన్నో పాట్లు పడ్డానని పవన్ కళ్యాణ్ ఎన్నో మీటింగ్స్‌లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు , హామీల విషయంలో ఇప్పుడు నో చెప్పడానికి లేదు '' అంటూ పవన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











