లడ్డూ వివాదంపై అల్లు అర్జున్ విలన్ షేకింగ్ కామెంట్స్.. మాటలతో కాదు.. వాటితో బుద్ది చెప్పాలి అంటూ!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసినట్లుగా వార్తలు రావడం యావత్ దేశాన్ని కలవరపాటుకి గురిచేసింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. సినీ, రాజకీయ రంగాలు సహా పలువురు ప్రముఖులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా సినీనటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు.

పవన్ 11 రోజుల దీక్షను ప్రారంభించి.. అక్టోబర్ 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆ వెంటనే దీక్ష విరమించనున్నారు. మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయ మెట్లను కడిగిన పవన్ పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు. తిరుమల లడ్డూల వ్యవహారంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటులు ప్రకాష్ రాజ్, కార్తీలకు ఆయన క్లాస్ పీకారు. సనాతన ధర్మం జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
మరోవైపు.. లడ్డూ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. నలుగురు సభ్యుల కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి ఇదే అంశంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాలు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. లడ్డూ ఆపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో తిరుమలలోని అర్చక స్వాములు సంప్రోక్షణ చేశారు. ఈ స్థాయిలో వివాదం చోటు చేసుకున్నప్పటికీ శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై ఎలాంటి ప్రభావం పడలేదని టీటీడీ చెబుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో 14 లక్షల లడ్డూలు విక్రయించినట్లుగా అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సినీనటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్పందించారు. స్థానిక గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్ధంతి వారోత్సవాల కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆయన.. తిరుమల లడ్డూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదని.. హిందువులకు గొడ్డు మాంసం లడ్డూలను ఇచ్చారని రవికిషన్ ఆరోపించారు. హిందువులు శాస్త్రాలతో పాటు శస్త్రాలను పట్టాల్సిన సమయం వచ్చిందని.. సాధువులు, యోధులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం రవికిషన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











