సినీ నిర్మాతకు ఏపీ ప్రభుత్వం షాక్.. వైసీపీ నేత విషయంలో ఆనాడే పవన్ కళ్యాణ్ హెచ్చరిక
ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ అంటే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. అదే ఎంవీవీ సత్యనారాయణ అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తారు. వైసీపీ అభ్యర్ధిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. వ్యాపారాలు చేసుకుంటూనే, రాజకీయ నాయకుడిగానూ కొనసాగారు. గతేడాది ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్, భార్య జ్యోతి, ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత విశాఖను వదిలి హైదరాబాద్‌కు తన మకాం మార్చాలని సత్యనారాయణ నిర్ణయించుకోవడం అప్పట్లో దుమారం రేపింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ ఆయనకు కనీసం టికెట్ సైతం ఇవ్వలేదు.
ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన జరిగి ఏడాది పూర్తవుతోంది. అయినప్పటికీ ఇంకా సస్పెన్స్ మాత్రం వీడలేదు.. ఈ ఘటన ఎంవీవీ ప్రత్యర్ధుల పనేనా, లేక సొంత పార్టీ నేతలే ఆయనను ఇబ్బంది పెట్టారా అంటూ విశాఖ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు సినీ నిర్మాతగానూ ఎంవీవీ సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఎంవీవీ సినిమా బ్యానర్‌పై గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో, గల్లీ రౌడీ, గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలు తీశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదలపై పెద్ద వివాదం నడిచింది. ఈ మూవీ రిలీజ్ ఆపాలని నిర్మాత నట్టికుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎంవీవీ నిర్మించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే సినిమా యథావిధిగానే విడుదలైంది.
తాజాగా ఎంవీవీ సత్యనారాయణకు గట్టి షాక్ తగిలింది. ఆయన యాజమాన్యంలోని హెచ్ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ .. సిరిపురం జంక్షన్‌లో చేపట్టిన అత్యాధునిక అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని జీవీఎంసీ నిలిపివేస్తూ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇష్యూ అయ్యింది. నిర్మాణ పనుల కోసం రాళ్లను పేల్చడం వల్ల దుమ్ము, శబ్ధ కాలుష్యం, సమీపంలోని భవనాలు దెబ్బతింటున్నాయని సిరిపురం ఏరియా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవీఎంసీకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కమీషనర్ పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది సైతం తనిఖీ చేసి ఆరోపణలు నిజమేనని తేల్చారు. శబ్ధ, వాయు కాలుష్యాలను నివారించడానికి.. రాళ్లు పడిపోకుండా ఎత్తుగా ఫెన్సింగ్ నిర్మించాలని కమీషనర్ ఆదేశించారు.

ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి , నాటి విపక్షనేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని సందర్శించారు. ఈ వివాదాస్పద వెంచర్ నుంచి ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బందుల్లో పడొద్దని జనసేనాని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ వెంచర్ కోసం టైకూన్ జంక్షన్ మూసివేయడంతో పవన్ సైతం సీరియస్ అయ్యారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో జంక్షన్‌ను తిరిగి తెరిచారు.
ఉత్తరాంధ్రలో చేసిన దోపిడీ, అన్యాక్రాంతమైన స్థలాలను బయటకు తీసుకొస్తామని , అప్పుడు జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ ఆనాడే హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే రాష్ట్రంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే నిబంధనలను తొంగలో తొక్కి, ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తోన్న వెంచర్‌కు చెక్ పెట్టింది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని కూటమి కేడర్ చెవులు కొరుక్కుంటోంది.


Click it and Unblock the Notifications











