‘పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేసుంటే.. చంద్రబాబుతో కలవకుండా ఉండి ఉంటే’
సహజంగానే ఆంధ్రులకు రాజకీయ చైతన్యం మెండు. అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడి నేతలు, జనం ఉంటారు. అందుకే ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతాయి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వై నాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి.. ఆయనను గద్దె దించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ .. టీడీపీ-బీజేపీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. హోరాహోరీ ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌లను ఇరువర్గాలు గట్టిగా చేయడం, భారీగా నమోదైన పోలింగ్‌తో జనం ఎవరికి షాక్ ఇవ్వనున్నారో అంటూ నేతల గుండెల్లో రైళ్లు ప్రత్యేకించాయి.
అన్నింటికి మించి కూటమితో పొత్తు పెట్టుకున్న జనసేనాని గెలుస్తారా, తనవారిని గెలిపించుకుంటారా అనే చర్చ విస్తృతంగా నడిచింది. పోలింగ్ ముగిసిన తర్వాత జాతీయ మీడియా, వివిధ ఏజెన్సీలు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ అంటే గతంలో ఎవరికీ తెలిసేది కాదు. ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ఫలితాల కోసం కూడా జనం ఉత్కంఠగా ఎదురుచూశారు. కొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని మాత్రం కూటమిదే అధికారమని చెప్పాయి.

అయితే ఎవరూ కూటమి సునామీని సృష్టిస్తుందని ఊహించలేదు . కానీ ఒక్క కేకే సర్వే మాత్రం కూటమి ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేస్తుందని .. దాదాపు 160కి పైగా సీట్లు వస్తాయని, వైసీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. జనసేన 21కి 21 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. దీనిని కూటమి కేడర్ సైతం నమ్మకపోగా.. వైసీపీ జనాలైతే దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఫలితాల విడుదల రోజున కేకే సర్వే చెప్పినట్లుగానే రిజల్ట్స్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇంత ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ నెంబర్‌ను ఎలా ఇవ్వగలిగారంటూ కేకే సర్వే యాజమాన్యాన్ని జనం ఆకాశానికెత్తేస్తున్నారు. పలు పార్టీలు , నేతలు ఈ సంస్థతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారని పొలిటికల్ టాక్.
ఈ నేపథ్యంలో కేకే సర్వే సీఈవో కిరణ్ కొండేటి ఇంటర్వ్యూల కోసం మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ క్యూకడుతున్నాయి. తాజాగా ఆయన ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితి, ఉద్యోగుల్లో అసంతృప్తి, రాజధాని అంశం ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించాయని కిరణ్ వెల్లడించారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చాయని.. కానీ అదొక్కటే ఓట్లను తీసుకురాదని ఆయన తెలిపారు. 2019లో జగన్‌కు ఓట్లేసిన వర్గాలు ఆయనను విడిచి వెళ్లకుండా ఉండటానికి వైసీపీ అధినేత చేయాల్సింది చేయలేదని కిరణ్ చెప్పారు.

ప్రజల ఎమోషన్ కనెక్ట్ చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని.. అందుకే ఇన్నిరకాలుగా డ్యామేజ్ జరగదని కిరణ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ , జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోకుండా బరిలో దిగుంటే రిజల్ట్ వేరే రకంగా ఉండేదన్నారు. చంద్రబాబు 175 స్థానాల్లో, పవన్ 175 స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి వున్నా.. లేదంటే పవన్ తను బలంగా ఉన్న 50 నుంచి 60 స్థానాల్లో బరిలో దిగినా ఫలితాలు గట్టిగా ప్రభావితమయ్యేవని కిరణ్ అభిప్రాయపడ్డారు.
ఏది ఎలా జరిగినా వైసీపీకి 30 శాతం ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదని 100 మందిలో 30 మంది అటువైపు నిలబడ్డారని పేర్కొన్నారు. జగన్‌కు సీట్లు రాకపోవచ్చు గానీ ఓట్లు మాత్రం భారీగానే పడ్డాయని కిరణ్ వెల్లడించారు. దీనిని బట్టి పవన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యారని , జనసేనాని వల్లే కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టిందని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











