‘మహేశ్‌కు నరనరాన ఆ పొలిటికల్ పార్టీ అంటే ఇష్టం.. అతడే సీఎం అవుతాడని ముందే చెప్పాడు’
సినీ పరిశ్రమకు , రాజకీయ రంగానిది విడదీయరాని అనుబంధం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడమో లేదంటే ఏదో ఒక పార్టీ పంచన చేరి ప్రచారం, మద్ధతు వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నేతలు, పార్టీలపై ఉండే అభిమానం ఒకటైతే.. వారి స్వప్రయోజనాలు, ఇష్టాయిష్టాలు కూడా ఇందుకు కారణమవుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో హిందీ నటులకు అభిమానులున్నా దక్షిణాది నటీనటులకు దక్కే ఆదరాభిమానులు వారికి ఉండవు. హీరోలను ఇంటి ఇలవేల్పు మాదిరిగా కొలవడం, ఏం చేసినా నెత్తిన పెట్టుకోవడం కేవలం దక్షిణాదిలోనే కనిపిస్తుంది. అభిమాన తారల కోసం రక్తదానాలు, అన్నదానాలు ఒకటేమిటి వారు పిలుపునివ్వడం ఆలస్యం.. ప్రాణాలు ఇచ్చేందుకైనా వెనుకాడరు.
ఈ క్రేజ్ ఆధారంగా ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ కొందరు మాత్రం తెరచాటునే ఉండి నైతిక మద్ధతు మాత్రం ఇచ్చేవారు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరో పార్టీ వాళ్లకు కోపం వస్తుందనో, అనవసరంగా వివాదాల్లోకి తలదూర్చటం ఇష్టం లేకనో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ డమ్ ఉన్నప్పటికీ వారు ఎక్కడా నోరు జారకుండా సంయమనంతో ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమనే తీసుకుంటే నటీనటులు, దర్శక నిర్మాతలు , ఇతర టెక్నీషియన్లలో ఎవరు ఏ పార్టీ అనేది జనం ఖచ్చితంగా చెప్పగలరు. కానీ కొందరిని మాత్రం అంచనా వేయడం కష్టం.

ఈ కోవలోకి వస్తుంది సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం. తొలినాళ్లలో ఏ పార్టీతోనూ అంటకాగకుండా తన పని తాను చేసుకుపోయేవారు కృష్ణ. స్వయంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆహ్వానించినా ఆయన తిరస్కరించారు. అయితే ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావడంతో కృష్ణను లాగాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఇదే సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దారుణహత్యతో సూపర్‌స్టార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని రాజీవ్ గాంధీకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారు.
హస్తం పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గా సేవలందించడంతో పాటు నాటి ముఖ్యమంత్రి , తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా ప్రచారం , సినిమాలు తీయడం వంటి కార్యక్రమాలు నిర్వహించి పెద్దాయనతో ఢీ అంటే ఢీ అన్నారు. ఇద్దరి అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తల సైతం అప్పుడప్పడు బాహాబాహీకి దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇదే సమయంలో 1989 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపీగా గెలిచారు కృష్ణ. ఐదేళ్లు విజయవంతంగా లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన 1991 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
తిరిగి 2004 ప్రాంతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభ్యర్ధన మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ తన నైతిక మద్ధతును ప్రకటించారు. అయితే వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు కృష్ణ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ కూడా కన్నుమూయడం, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం, అల్లుడు గల్లా జయదేవ్ కూడా టీడీపీలో ఉండటంతో కృష్ణ కుటుంబం తెలుగుదేశం పార్టీ వైపే ఉందనే టాక్ నడుస్తోంది. అన్నింటికి మించి ప్రస్తుతం సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న మహేశ్ బాబు ఎవరి వైపు, ఏ పార్టీ వైపు అనేది మాత్రం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో రాజకీయ రంగంపై మహేశ్ ఉద్దేశ్యాలపై కీలకవ్యాఖ్యలు చేశారు కృష్ణ సోదరుడు, మహేశ్ బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. మహేశ్ రాజకీయాలను పరిశీలిస్తాడు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడని.. తెలంగాణ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రసంగాలను చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తనతో చెప్పాడని ఆదిశేషగిరిరావు తెలిపారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అటు రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా మారుతోందన్నారు. తెలంగాణ, కర్ణాటకలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయని.. రేపు ఆంధ్రప్రదేశ్ కూడా రావొచ్చునేమోనంటూ ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మహేశ్ బాబు గురించి ఆదిశేషగిరి రావు చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహేశ్ బాబు కాంగ్రెస్ పక్షమేనంటూ ఆ పార్టీ నేతలు, కేడర్ తెగ సంబరపడిపోతున్నారు. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నోసార్లు ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్‌పై మహేష్ కూడా ఫేవర్‌గా ఉన్నారనే వార్త ఆ పార్టీ వాళ్లకు కూడా ఆనందాన్ని ఇస్తుందంటున్నారు.


Click it and Unblock the Notifications











