అందుకే రోజా, శ్యామలను అలా.. అర్థరాత్రి తలుపులు కొట్టి.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
జబర్దస్త్ ద్వారా పాపులరైన కిరాక్ ఆర్పీ.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా వ్యాపారవేత్తగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఔట్‌లెట్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆర్పీ వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా నడుస్తోంది. తెలుగు నాట మరిన్ని పట్టణాలు, నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో కిరాక్ ఆర్పీ ఉన్నారని ఫిలింనగర్ టాక్. అలాంటిది బిజినెస్‌ను పక్కనబెట్టి అనూహ్యంగా రాజకీయాల్లోకి దిగారు ఆర్పీ.
తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని అయిన కిరాక్ ఆర్పీ 2024 ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీకి మద్ధతుగా మాట్లాడుతున్నారు. టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం కూడా చేశారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు ఆర్పీ. ఫలితాలు విడుదలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తన దూకుడు మరింత పెంచారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ , రోజుకొక ప్రెస్‌మీట్ పెట్టి చెడుగుడు ఆడుకుంటున్నాడు ఆర్పీ. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాను ఆయన ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్పీ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా రోజా ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు.

అయితే ఓ సాదాసీదా నటుడు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి పెద్దవాళ్లను నానామాటలు అంటే ఊరుకుంటారా అనే డౌట్ రావొచ్చు. ఇదే ప్రశ్నను పలుమార్లు మీడియా ప్రతినిధులు కూడా ఆయనను అడిగారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ పార్టీ వీరాభిమానులు కొందరు తనపై కక్షగట్టారని.. తన ఔట్‌లెట్లపై దాడులు జరిగాయని, ఫ్రాంఛైజీల విస్తరణను అడ్డుకున్నారని ఆర్పీ ఆరోపించారు. అర్ధరాత్రుళ్లు తన ఇంటి తలుపులను కొట్టి భయభ్రాంతులకు గురిచేసేవారని , సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. రోజా, శ్యామల, వేణుస్వామి, కొడాలి నాని మాట్లాడిన దాంట్లో తనది ఎంతో ఉండదని.. తాను కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నానని చెప్పారు. రోజా తిరుపతి వెళితే.. శ్రీవారి దర్శనం ఎలా జరిగింది, రాష్ట్రం కోసం ఏం కోరుకున్నానో చెప్పకుండా ఎంతసేపటికీ జగనన్న.. జగనన్న అంటారని దుయ్యబట్టారు. రోజా రూ.3 వేల కోట్లకు పైగా సంపాదించారని, గుట్కాలు తినే కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టిన బూతులు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేని బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి స్థాయెంత.. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తాడని కిరాక్ ఆర్పీ మండిపడ్డారు. ఇప్పుడు దమ్ముంటే బయటికొచ్చి మాట్లాడాలని .. పిల్లాడిని, ఆటలో అరటిపండును చేసి సిద్ధార్ధ్ రెడ్డిని ఆడుకున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీ తరపున మాట్లాడుతున్నందుకు ఏదైనా పదవి తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆర్పీ స్పందిస్తూ తాను ఈ పదవిపై ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. చంద్రబాబును కలిసే కండువా కప్పుకున్నానని, మన పని మనం చేసుకుంటూపోతే భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడని.. అంతకుమించి తాను ఏ పదవిని ఆశించడం లేదని ఆర్పీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











