డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే ప్రశ్నించవా? రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చకు.. జగన్‌పై కిరాక్ ఆర్పీ
జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కిరాక్ ఆర్పీ.. ఆ షో ఇచ్చిన గుర్తింపుతో తెలుగునాట ప్రతి ఇంటికీ పరిచయమయ్యారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలను సైతం అందుకున్నారు. వినోద రంగంలో ఎప్పుడు ఎలాంటి పరిస్ధితులు ఉంటాయో భవిష్యత్తును ముందే ఊహించి వ్యాపారంలోనూ దిగారు ఆర్పీ. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో నాన్ వెజ్ వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఆయన ఔట్‌లెట్లు తెరిచారు.
రాజకీయాల పట్ల చురుగ్గా ఉండే కిరాక్ ఆర్పీ తెలుగుదేశం పార్టీకి మద్ధతుదారుడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల తరపున ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే వైసీపీ నేతలు చేసే విమర్శలకు తనదైనశైలిలో కౌంటర్లు వేసేవారు ఆర్పీ. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్పీ మరింత చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజాలపై ఆయన వేసే సెటైర్లు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుండగా.. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇప్పటికే పలువురిని దారుణంగా హతమార్చారని ఆరోపించారు. ఈ దారుణాలపై పోలీసులు మౌనం దాల్చుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు కూడా పత్రికల ముసుగులో దిగజారిపోయాయని వైసీపీ అధినేత మండిపడ్డారు. ఇంతలో ఓ పాత్రికేయుడు జగన్ ప్రసంగం ముగిసిందనుకుని ప్రశ్న వదిలాడు.
దీంతో మాజీ ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొచ్చింది.. ఆగప్పా, చెప్పేటప్పుడు మధ్యలో వస్తే ఫ్లో దెబ్బతింటుందని జగన్ అసహనం వ్యక్తం చేశారు. కొంచెం ఆగు, ప్రసంగం ముగిసిన తర్వాత అడుగు అంటూ ఆ విలేకరికి చెప్పారు. తన ప్రసంగం కొనసాగించే ప్రయత్నం చేయగా.. ఆయన సబ్జెక్ట్ మరిచిపోయారు. దీంతో పక్కనే ఉన్న అంబటి తదితరులు సబ్జెక్ట్‌ను గుర్తుచేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనే కిరాక్ ఆర్పీ సెటైర్లు వేశారు. జగన్ ఒకటి రాసుకుని వచ్చాడని, మీడియా వాళ్లు మధ్య మధ్యలో క్వశ్చన్లు అడిగితే ఎలా అంటూ వ్యాఖ్యానించారు.

మీరేం ప్రశ్నలు అడుగుతారోనని జగన్ భయపడ్డారని.. తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త జై చంద్రబాబు అన్నారని కంఠం కోసేశారని అప్పుడెందుకు పరామర్శించలేదని అడుగుతారని మీడియా వాళ్ల మీద కసురుకున్నాడని చెప్పారు. అమర్‌నాథ్ గౌడ్ అనే బాలుడు తన అక్కని ఏడిపిస్తున్న వారిని ప్రశ్నించాడని కిరోసిన్ పోసి కాల్చేస్తే మీరేందుకు పరామర్శించలేదని మీరు అడుగుతాడని భయపడ్డారని ఆర్పీ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరెందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడుగుతారని జగన్ భయపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. సొంత బాబాయ్‌ని చంపేస్తే మాట్లాడి వెళ్లిపోయావు.. కన్నీళ్లు మీరెందుకు పెట్టలేదని అడుగుతారని జగన్ భయపడిపోయారని ఆర్పీ తెలిపారు.
మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వడం మా బాధ్యత అని.. నేను మాట్లాడేటప్పుడు అలాగే అడుగుతారని, ఏదో టెలికాస్ట్ చేసుకుని వెళ్లిపోతే ప్రెస్‌వాళ్లు ఎందుకవుతారని కిరాక్ ఆర్పీ ప్రశ్నించారు. మీకొచ్చిన డౌట్లపై నన్ను నిలదీయాలి, ప్రశ్నించాలని, ఎదిరించాలని అవసరమైతే నన్ను బెదిరించాలని అది ప్రెస్‌మీట్ అవుతుందన్నారు. అలా కాకుండా సదర్ విలేకరి పట్టుకుని నానా మాటలు అన్నారని ఆర్పీ ఆగ్రహించారు.
గతంలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అడిగినప్పుడు జగన్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని , ప్రజలను మభ్యపెడదామంటే కుదరదంటూ కిరాక్ ఆర్పీ చురకలంటించారు. ఇప్పుడు ఏం జరిగిందని మధ్యంతర ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నావు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











