జగన్ అమాయకుడు.. న్యాయం చేయండి : చంద్రబాబు, పవన్‌లకు నాగబాబు విజ్ఞప్తి.. ట్వీట్ వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి, కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజుల గడవకముందే ప్రతిపక్ష వైసీపీ అప్పుడే పోరాటాల బాట పట్టింది. ప్రతి కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందని తెలిసినా.. సరే ఓటమితో బిక్కచచ్చిపోయి ఉన్న కేడర్‌లో ఏదో రకంగా జోష్ నింపాలని జగన్ తాపత్రయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులపై వేధింపులు పెరిగాయని.. దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 31 హత్యలు జరిగాయని.. వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని , 1050 దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గత వారం పల్నాడు జిల్లా వినుకొండలో షేక్ రషీద్ హత్య వార్త తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన తాడేపల్లికి బయల్దేరి వచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు మందీ మార్భలంతో వెళ్లారు.

అక్కడితో ఆగకుండా ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక పరిస్ధితులపై దేశ రాజధాని ఢిల్లీలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారని, రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దాడులను , హత్యలను ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు.
అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. వైసీపీ అధినేతపై సెటైర్లు వేస్తూ, ఆరోపణలు చేస్తున్న ఆయన మొన్నామధ్య వినుకొండ ఘటనపైనా స్పందించారు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేతను ప్రజలు నమ్మడం ఎప్పుడో మానేశారని నాగబాబు దుయ్యబట్టారు. వినుకొండ హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షల కారణంగా జరిగినదని .. దానికి రాజకీయ రంగు పులిమి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నటించడమే జగన్ అలవాటుగా చేసుకున్నారంటూ నాగబాబు దుయ్యబట్టారు.

తాజాగా ఐదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడిపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. '' 2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు ''.
'' అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారి కున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సిఎం గారిని, డిప్యూటీ సిఎం గారిని, హోం మంత్రి గారిని కోరుకుంటున్నాను '' . అంటూ నాగబాబు సెటైరికల్‌గా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











