ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ .. లోకేష్ కనుసన్నల్లోనే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి అండగా నిలవడంతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు నాగబాబు. ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పొత్తుల కారణంగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు నాగబాబు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో కాలికి బలపం కట్టుకుని తిరిగిన నాగబాబు రాష్ట్రంలోని కూటమి అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేశారు.
నాగబాబుకు న్యాయం చేయాలని పవన్ గట్టిగానే ప్రయత్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) ఛైర్మన్‌గా ఆయన పేరు గట్టిగానే వినిపించింది. కానీ తాను టీటీడీ ఛైర్మన్ రేసులో లేనని, పవన్ కళ్యాణ్ కోసం చివరి వరకు శ్రమిస్తానని నాగబాబు తెలిపారు. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికలు రాగా.. ఏపీ నుంచి నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కూటమి ఖరారు చేసిన అభ్యర్ధుల జాబితాలో నాగబాబు పేరు లేదు.

దీంతో నాగబాబుకు న్యాయం జరుగుతుందా? పవన్ ఎలాంటి పావులు కదుపుతున్నారు? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ, మంత్రిగా ఆయనకు అవకాశం దక్కినట్లుగా అధికార వర్గాల నుంచే సంకేతాలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కేటగిరీలో నాగబాబుకు అవకాశం కల్పిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. దానితో పాటే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఆ వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి కూటమి పార్టీలు. నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వంపై ఈ సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే నాగబాబు అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా అభ్యర్ధులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం కూటమి తరపున నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అధినేత ఆదేశాల మేరకు నిన్న నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్న నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా సచివాలయానికి చేరుకున్నారు నాగబాబు. అనంతరం మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితా రాణికి సమర్పించారు. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు పేరును మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నాగబాబు బయటకు వచ్చే వరకు లోకేష్ ఆయన పక్కనే ఉండి పర్యవేక్షించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో సంఖ్యా బలం దృష్ట్యా నాగబాబు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో గరిష్టంగా 25 మందిని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సహా 24 మంది మంత్రులు ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు దక్కాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగబాబును కూడా మంత్రిగా తీసుకుంటారనే ఊహాగానాలు వస్తుండగా.. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మనసులో ఏముందో త్వరలోనే బయటపడనుంది.


Click it and Unblock the Notifications











