Naga Babu : చిన్న సంతకానికి ఇంత రచ్చా.. జగన్ డిక్లరేషన్‌పై నాగబాబు షాకింగ్ కామెంట్స్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసినట్లుగా వార్తలు రావడం యావత్ దేశాన్ని కలవరపాటుకి గురిచేసింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పలువురు సినీ, రాజకీయ రంగాలు సహా పలువురు ప్రముఖులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా సినీనటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు.

పవన్ 11 రోజుల దీక్షను ప్రారంభించిన ఆయన అక్టోబర్ 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆ వెంటనే దీక్ష విరమించనున్నారు. గత మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను కడిగిన పవన్ పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు. వైసీపీ హయాంలో ఉన్న టీడీపీ బోర్డే ఈ లడ్డూ కల్తీపై సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటులు ప్రకాష్ రాజ్, కార్తీలను ఆయన సున్నితంగా మందలించారు.
మరోవైపు.. లడ్డూ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. నలుగురు సభ్యుల కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేయిస్తోంది. లడ్డూ కల్తీ అయినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ అర్చుకులు శుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లడ్డూ పోటూ, ప్రసాదాలు ఉంచే ప్రదేశాలు, తదితర ప్రాంతాల్లో వేదమంత్రాలతో సంప్రోక్షణ చేశారు.
తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై సినీనటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ అసలైన సెక్యులర్ అన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్లని, డిక్లరేషన్ ఇష్యూపై వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని నాగబాబు మండిపడ్డారు.
హిందూ ఆలయాలు హిందువులే నిర్వహించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ డిక్లరేషన్‌పై ఓ చిన్న సంతకం పెడితే అయిపోయే దానికి రచ్చ చేస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. లడ్డూ వివాదం వెనుక ఎంతటి వారున్నా సిట్ దర్యాప్తులో ఖచ్చితంగా బయటకొస్తారని ఆయన హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











