తెలుగు నిర్మాత కన్నుమూత.. మృతికి కారణం ఏమిటి?
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. జూన్ 5న గోపీనాథ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు గోపీనాథ్ తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిశిర ఉన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
మాగంటి గోపీనాథ్ ప్రస్థానం:
1963 జూన్ 2న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పట్టా పొందారు. తన అభిమాన నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో ఆయన పిలుపు మేరకు టీడీపీలో చేరారు మాగంటి గోపీనాథ్. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో అనతికాలంలోనే ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు గోపీనాథ్. ఈ క్రమంలో 1985 నుంచి 1992 వరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా గోపీనాథ్ వ్యవహరించారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే
1987, 1988లో అత్యంత కీలకమైన హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా సేవలందించారు గోపీనాథ్. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో 35 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని నాటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచిన మాగంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) మెంబర్‌గా పనిచేశారు.
సినీ నిర్మాతగా మాగంటి
మాగంటి గోపీనాథ్‌కు కాలేజ్ రోజుల నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. రాజకీయాల్లోకి ప్రవేశించి బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని సినిమాలు చూసేవారని సన్నిహితులు చెబుతుంటారు. ఇదే సమయంలో మాగంటి గోపీనాథ్ దివ్య అక్షత నాగ మూవీస్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన పాతబస్తీ ఆయన తొలి సినిమా.
ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన రవన్న (2000), తారకరత్నతో భద్రాద్రి రాముడు(2004), డాక్టర్ రాజశేఖర్‌తో నా స్టైటే వేరు(2009) సినిమాలు నిర్మించారు. కానీ ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో సినిమాల నిర్మాణానికి దూరమయ్యారు గోపీనాథ్. అయితే రాజకీయాల్లో మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు గోపీనాథ్. 2023 తెలంటణ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌పై విజయాన్ని గోపీనాథ్ రాజకీయ జీవితంలో మైలురాయిగా విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Click it and Unblock the Notifications











