జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో జయసుధ? చక్రం తిప్పుతోన్న కీలకనేత.. ఆ ఇద్దరితోనే సవాల్
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, ఎంపీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం
భారత రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మాగంటి గోపీనాథ్ జూన్ 8న గుండెపోటుతో కన్నుమూశారు. 2014, 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి. 2023లో కాంగ్రెస్ హవాను ఎదుర్కొని నిలబడ్డ గోపీనాథ్ మూడోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన హఠాన్మరణంతో బీఆర్ఎస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత
ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని గులాబీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను బరిలోకి దించుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి హస్తం పార్టీ షాకిచ్చింది. దీంతో ఆశావహులు జోరుగా టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున యువ నేత నవీన్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రెహమత్ నగర్‌కు చెందిన కార్పోరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీలో భారీ ఆశావహులు
ఇకపోతే.. బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్ధిగా ఎవరు ఖరారు కానున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముగ్గురు సభ్యుల కమిటీ వేసిన తెలంగాణ బీజేపీ.. అభ్యర్ధి ఎంపికపై త్వరగా తేల్చాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా లంకా దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, కీర్తి రెడ్డి, డాక్టర్ విప్పర్తి పద్మారెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ లిస్ట్‌లో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. అది ఎవరో కాదు సీనియర్ నటి జయసుధ.
జయసుధతో రామచందర్ రావు భేటీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం జయసుధకు ఉంది. అలాగే జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా సినీ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు, సంపన్నులు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరితో జయసుధకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఘట్టమనేని, మహేశ్ అభిమానుల మద్ధతు జయసుధకే ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు నేరుగా జయసుధ ఇంటికి వెళ్లి మంతనాలు సాగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు జయసుధ అంగీకరించారా? జయసుధతో రామచందర్ రావు ఎలాంటి హామీ ఇచ్చారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











