ఆ ఒక్క తప్పుతో వైఎస్ జగన్‌ను వ్యతిరేకించా.. కల్కి నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు
అన్న నందమూరి తారక రామారావుతో సినిమా తీయాలని మద్రాస్‌లో అడుగుపెట్టిన ఓ కుర్రాడు.. తన అభిమాన నటుడితో సినిమాను నిర్మించడమే కాదు ఇప్పుడు భారతదేశంలోని అగ్ర నిర్మాతలల్లో ఒకరిగా నిలిచారు. ఆయనే చలసాని అశ్వినీదత్. నట సార్వభౌముడి చేతుల మీదుగా పురుడు పోసుకున్న వైజయంతీ మూవీస్ ఐదు దశాబ్ధాలుగా విజయవంతంగా కొనసాగుతూ.. భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
1974లో నటరత్నతో తెరకెక్కించిన ఎదురులేని మనిషి నుంచి నేటి కల్కి 2898 ఏడీ వరకు ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది వైజయంతీ మూవీస్. టాలీవుడ్ చరిత్రలో మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించిన అరుదైన ఘనత అశ్వినీదత్‌దే. తెలుగు సినిమా తొలి తరం సూపర్‌స్టార్లయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబుతో పాటు సెకండ్ జనరేషన్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సినిమాలు నిర్మించారు అశ్వినీదత్. తర్వాత పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్‌లతో సినిమాలు తీశారు. తన సినిమాల్లో విజువల్ వండర్‌గా, భారీతనంతో, హంగులు , ఆర్బాటాలు ఉండాల్సిందే. కొన్నిసార్లు దెబ్బతిన్నప్పటికీ, ఎక్కువసార్లు సక్సెస్ కొట్టారు అశ్వినీదత్.

రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే అశ్వినీదత్.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి గట్టి మద్ధతుదారు. ఎన్నోసార్లు టీడీపీ కోసం ప్రచారం చేశారు, ఆపద కాలంలోనూ అండగా నిలిచారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంల నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అశ్వినీదత్ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో యాక్టీవ్‌గానే ఉంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు అదే స్థాయిలో సన్నిహిత సంబంధాలున్నాయి.
ప్రస్తుతం కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో అశ్వినీదత్ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన ఈ మూవీ .. అదే జోరు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అశ్వినీదత్ ఇంటర్వ్యూల కోసం మీడియా క్యూకడుతోంది. అలా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన కెరీర్, సినిమాల నిర్మాణం, రాజకీయాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అశ్వినీదత్. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కల్కి వంటి పెద్ద సినిమాను త్వరలో రిలీజ్ చేయాల్సి ఉండగా.. జగన్ పాలనపై మీ వాదనను బలంగా ఎలా వినిపించగలిగారని యాంకర్ అడిగిన ప్రశ్నకు అశ్వినీదత్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిజాలను నిక్కచ్చిగా చెప్పమని తన తండ్రి నేర్పించారని, జగన్ విషయంలో తానెక్కడా డిఫర్ కాలేదని తెలిపారు. ఆయన తమతో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారని.. తన రెండో కుమార్తె పెళ్లికి కూడా జగన్ వచ్చారని చెప్పారు.
అయితే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయానని.. ఈసారి టీడీపీకి 160కి పైగా సీట్లు వస్తాయని , ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పానని.. తాను అన్నట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయని అశ్వినీదత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











