మీ బోల్టులు బిగిస్తాం .. ఫిల్మ్ ఇండస్ట్రీపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
సినీ పరిశ్రమకు రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు వర్గాల మధ్య ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. పలువురు నటీనటులు ఏదో ఒక రాజకీయ పార్టీతో అంటకాగుతున్న వారే. రాజకీయ అవసరాలు ఇతర ప్రయోజనాల నిమిత్తం సినీనటులతో రాజకీయ నేతలు కూడా సన్నిహితంగానే మెలుగుతున్నారు. అయితే కొంతకాలంగా సినీ పరిశ్రమకు, రాజకీయ నేతలకు ఎందుకో పడటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది. టికెట్ రేట్లను తగ్గించడంతో పాటు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. అలాగే టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రభుత్వమే వెబ్ పోర్టల్‌ను రూపొందించాలని చూసింది. ప్రభుత్వంతో గ్యాప్ పెరుగుతుండటంతో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళిలను వెంట పెట్టుకుని నాటి సీఎం వైఎస్ జగన్ దగ్గరికి వెళ్లారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలుగు సినీ పరిశ్రమ ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా సాగింది. వాళ్లు ఏం కోరుకుంటే అది క్షణాల్లో దొరికేది. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌లతో సినీ పెద్దలు సన్నిహితంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ సర్కార్‌తో టాలీవుడ్‌కు గ్యాప్ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామాలు సినీ, రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి.
తెలుగు రాష్ట్రాలే కాదు.. ఇప్పుడు కర్ణాటకలోనూ అక్కడి ప్రభుత్వానికి , కన్నడ సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నారు. గతంలో రాష్ట్ర సంక్షేమం, హక్కుల సాధన కోసం ప్రభుత్వ పెద్దలు పిలుపునిచ్చిన తక్షణం సినీ పరిశ్రమ కదిలొచ్చేది . కానీ నేడు ఆ పరిస్ధితులు కనిపించకపోవడంతో సినీ పరిశ్రమపై రాజకీయ నేతలు , ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.

బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవానికి కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకాకపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. విధానసౌధలో జరిగిన జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నడ గడ్డ, భాష గురించి సినీ ప్రముఖులు స్పందించకుంటే మీ నట్లు, బోల్టులను టైట్ చేస్తామని డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్ధతు ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుండగా.. యశ్, కిచ్చా సుదీప్, దర్శన్ వంటి స్టార్ల నట్లు, బోల్టులను టైట్ చేయగలరా అంటూ ప్రతిపక్ష బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరి దీనిపై శాండిల్‌వుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











