అవినీతి, అక్రమార్కులకు సింహస్వప్నం.. పవన్ కల్యాణ్ టీమ్‌లో టెర్రర్ ఆఫీసర్!
విపక్షనేతగా ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ నేడు పాలకుడిగా మారారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. అయితే పాలకుడు మంచివాడైతే చాలదు, వ్యవస్థ కూడా అలాగే ఉంటేనే చిట్టచివరన ఉన్న వర్గాలకు లబ్ధి కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. సమర్ధులైన , ప్రతిభావంతులైన, తన ఆశయాలను నెరవేర్చే పవర్‌ఫుల్ అధికారుల కోసం డిప్యూటీ సీఎం అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజపై పవన్ చూపు పడింది. తెలుగు వ్యక్తే అయినా కేరళ కేడర్ కావడంతో ఆయన తనకు కావాలని సీఎం చంద్రబాబుకు చెప్పడంతో .. ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కృష్ణ తేజ భేటీ అయ్యారు. ఈ యువ ఐఏఎస్ సొంతూరు పల్నాడు జిల్లా చిలకలూరిపేట. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా, అలెప్పి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

ప్రధానంగా 2018లో కేరళను వర్షాలు, వరదాలు ముంచెత్తిన సమయంలో ఆయన ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు అలెప్పి సబ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ , మంత్రి డాక్టర్ ఇసాక్‌తో కలిసి సహాయ పునరావాస కార్యక్రమాలను చురుగ్గా చేపట్టి 48 గంటల్లో 2.5 లక్షల మందిని , పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యాంప్‌లలో ఉన్న వారికి భోజనం, వైద్యం ఇతర సదుపాయాలను కల్పించారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు ఉపాధి, నిత్యావసర వస్తువులు సమకూర్చిపెట్టడంతో జాతీయ స్థాయిలో కృష్ణతేజ పేరు మారుమోగింది.
జలప్రళయం తర్వాత కరోనా రూపంలో మహమ్మారి విరుచుకుపడటంతో తల్లిదండ్రులను కోల్పోయిన 600 మంది పిల్లల బాధ్యతలను తీసుకున్నారు. ఆయన కృషిని జాతీయ బాలల రక్షణ కమీషన్ అభినందించింది. అక్రమార్కులకు , హద్దు మీరిన వారికి సింహస్వప్నంగానూ నిలిచారు. అలెప్పీ జిల్లాలోని వెంబనాడ్ సరస్సులో మధ్యలోని మూడెకరాల దీవిని ఆక్రమించి కట్టిన కేపీకో రిసార్ట్స్‌ను కూల్చేయాల్సిందిగా సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

మహామహులు, కాకలు తీరిన ఉన్నతాధికారులే భయపడ్డ వేళ కృష్ణతేజ ఆ రిసార్ట్స్ మీదకు బుల్ డోజర్లను నడిపించారు. ఇలాంటి ఆక్రమణలకు గురైన భూములను ఆయన ప్రభుత్వానికి చెందేలా చేశారు. కృష్ణతేజలోని టెంపర్, గట్స్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి డైనమిక్ ఆఫీసర్ కాబట్టే కృష్ణతేజ తన టీమ్‌లో ఉండాలని పవన్ తాపత్రాయపడుతున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఐఏఎస్ కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ పంపేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) గత శుక్రవారం అనుమతులిచ్చింది. దీంతో ఆయన నిన్న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా.. ఆ వెంటనే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇకపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీమ్‌లో కృష్ణతేజ కీలక భూమిక పోషించనున్నారు. పాలనలో ఎంతో అనుభవం ఉన్న ఈ యువ ఐఏఎస్ తన సొంత రాష్ట్రం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











