‘చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో మాస్టర్ స్కెచ్.. 2009 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ దిగాలుగా’
కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చని నిరూపించి.. చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన దిగ్గజాలలో చిరంజీవి ఒకరు. అతి సామాన్య స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగి, దశాబ్థాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరు. తెలుగు నాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. పెద్దాయన బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించి రాజకీయాల్లోకి దూకారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడటం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించిన చిరు.. తర్వాతి రోజుల్లో పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ టీడీపీ విజయావకాశాలను దెబ్బకొట్టిందని విశ్లేషకులు చెబుతారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సెగ్మెంట్లలో మహాకూటమి అభ్యర్ధులు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. టీడీపీకి పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు పీఆర్పీ వైపు మళ్లడం కొంపముంచిందని అంటారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం వెనుక దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు .. బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్), సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేశారు.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్ నివేదికలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్టులతో తేడా కొడుతుందని భయపడ్డ వైఎస్.. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల బరిలో నిలిచేలా రాజకీయ వ్యూహం రచించారని చెబుతారు. తద్వారా నాటి ఉమ్మడి ఏపీలో పీఆర్పీ 16.32 శాతం ఓట్లు సాధించింది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. తాజాగా పీఆర్పీ స్థాపన, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ స్నేహితుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.

రిజల్ట్స్ వచ్చిన రోజున వైఎస్ చాలా దిగాలుగా కనిపించారని, మళ్లీ సీఎం అవుతున్నానన్న ఆనందం ఆయనలో కనిపించలేదన్నారు. ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి, అభివృద్ధిని పరుగులు పెట్టించినా ప్రజలు పాస్ మార్క్సే ఇచ్చారని.. డిస్టింక్షన్ ఇవ్వలేదని వైఎస్ అనేవారని కేవీపీ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆర్గనైజింగ్ స్కిల్స్ వల్లే ఎన్నికల్లో గెలిచామని తనతో చెప్పారని ఆయన వెల్లడించారు.
ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కంపెనీల స్థాపన కోసం ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ ప్రముఖులు తన అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేసేవారని రామచంద్రరావు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులకు మీడియాలో తగినంత ప్రచారం జరగలేదని కేవీపీ పేర్కొన్నారు. జలయజ్ఞం, ఇందిరమ్మ కార్యక్రమంలోని అవకతవకలపై క్షేత్ర స్థాయి నుంచి తప్పుడు నివేదికలు వచ్చేవని.. దీనిపై వైఎస్‌ను తాను హెచ్చరించేవాడినని రామచంద్రరావు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కేవీపీ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











