వైసీపీ కంబంధ హస్తాల్లో నుంచి ఏపీ బయటపడ్డాకే ఆయన మరణం.. జగన్‌పై కీరవాణి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై చిత్ర పరిశ్రమ ప్రముఖుల కోపం చల్లారినట్లుగా లేదు. ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను మూడు చెరువుల నీళ్లు తాగించారు. టికెట్ ధరల తగ్గింపు, ప్రభుత్వ వెబ్ పోర్టల్, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు ఇలా అసాధారణ నిర్ణయాలతో జగన్ టాలీవుడ్‌ని చెడుగుడు ఆడుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీ ఇబ్బందుల గురించి మాట్లాడటానికి చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వస్తే.. వారి కార్లు గేటు బయటే ఆపించి, లోపలికి నడిపించుకుంటూ తీసుకొచ్చారని పరిశ్రమ, అభిమానులు రగిలిపోయారు. చిరంజీవి చేతులెత్తి జగన్‌కు దండం పెడుతున్న వీడియోను లీక్ కావడాన్ని కోట్లాది మంది జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏపీలో రావాలని సినీ ప్రముఖులు కోరుకున్నారు.

ఎన్నికలు ముగిశాయి జగన్ ఓడిపోయి.. చిత్ర పరిశ్రమకు అనుకూల వ్యక్తిగా ముద్రపడిన చంద్రబాబు నాయుడు సీఎంగా స్వయంగా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. చాలాకాలం తర్వాత బెనిఫిట్ షోలు, స్పెషల్ షోల కల్చర్ మళ్లీ ఏపీలో మొదలైంది. నిన్న రిలీజైన నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కల్కి 2898 ఏడీ సినిమాకు అన్ని రకాల అనుమతులు దక్కాయి. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లు ఊపందుకునే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ఈ మేరకు అప్పుడే సినీ ప్రముఖులతో భేటీలు అవుతున్నారు.
జగన్ ఘోర పరాజయం పాలైన సినీ పరిశ్రమలోని కొందరికి ఆయనపై కోపం తగ్గలేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొందరు నటీనటులు యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ పాలన, ఎన్నికల్లో ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ తన పాలనలో ఏపీ భ్రష్టు పట్టించారని, ఎక్కడా అభివృద్ధి లేదని .. కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఉన్న కంపెనీలను వెళ్లగొట్టారని మురళీమోహన్ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆయన ఆకాంక్షించారు.
తాజాగా జగన్‌పై విరుచుకుపడ్డారు సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి. ఇటీవల కన్నుమూసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై రామోజీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ నేపథ్యంలో కీరవాణి మాట్లాడుతూ.. బతికితే రామోజీరావులా బతకాలని అప్పట్లో అన్నానని.. కానీ ఇప్పుడు మాత్రం మరణించినా ఆయనలాగే మరణించాలన్నారు. కురుక్షేత్రంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయనం ప్రవేశించే పుణ్యకాలం వరకు నిలిపి ఉంచారని.. అలాగే తనకు ఎంతో ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో నుంచి బయట పడటం రామోజీ తన కళ్లారా చూసాకే నిష్క్రమించారని కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫోటో మా పూజగదిలో ఉంటుందని.. రామోజీ దేవుడిని నమ్మరని, అలాంటి వ్యక్తి ఫోటో మా ఇంట్లో దేవుడు ఉండాల్సిన చోట ఉంటుందని కీరవాణి చెప్పారు. వైసీపీ, జగన్‌పై ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో రామోజీరావును జగన్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఒకానొకదశలో ఆయనను అరెస్ట్ చేయాలని కూడా భావించింది. అయితే రామోజీరావు వయసు, అనారోగ్యం.. పలు ఒత్తిళ్ల కారణంగా జగన్ వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు అంటారు. లేనిపక్షంలో జగన్ అంతటి సాహసం చేసేవారేనని కామెంట్లు వినిపించాయి. రామోజీ చనిపోయిన రోజున కూడా పలువురు సినీ ప్రముఖులు జగన్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రామోజీరావును కొందరు రాజకీయంగా ఇబ్బంది పెట్టారని.. కానీ వారి పతనాన్ని చూశాకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారంటూ రాజేంద్రప్రసాద్, పవన్ కళ్యాణ్ తదితరులు వ్యాఖ్యానించారు. తాజాగా కీరవాణి వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











