'పవన్ కల్యాణ్‌ను కక్షగట్టి ఓడించాలని స్కెచ్.. పవర్ స్టార్ విజయాన్ని ఆపగలిగారా?
జయప్రకాష్ నారాయణ.. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నత పదవిలో ఉన్నప్పుడే స్వచ్చంద పదవీ విరమణ చేసి సమ సమాజ స్థాపనతో పాటు ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించేందుకు , అవినీతిరహిత సమాజం కోసం లోక్‌సత్తాను స్థాపించారు. తన ప్రసంగాలు, రచనల ద్వారా ఇందుకోసం ఎంతో శ్రమించారు. అయితే రాజ్యాధికారం ద్వారానే మార్పు సాధ్యమని బలంగా నమ్మిన జయప్రకాష్ నారాయణ 2006 అక్టోబర్ 2వ తేదీన లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు.
రాజకీయాల్లోకి వద్దు అని మిత్రులు, తోటి మేధావులు ఆయను నిలువరించే ప్రయత్నం చేసినా జయప్రకాష్ పట్టించుకోలేదు. అయితే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో లోక్‌సత్తా అభ్యర్ధులంతా దారుణ పరాజయాన్ని మూటగట్టుకో కూకట్‌పల్లి నుంచి గెలిచి జయప్రకాష్ నారాయణ ఒక్కరే అసెంబ్లీలో అడుగుపెట్టారు. సబ్జెక్ట్, పాలనా వ్యవహారాలపై అపార అనుభవం ఉన్న జయప్రకాష్ నారాయణ సభలో చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రత్యర్ధి పార్టీలు సైతం ఆయన విధానాలను మెచ్చుకునేవంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర విభజన తర్వాత లోక్‌సత్తా పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయి కనుమరుగైంది.

అయినప్పటికీ ఇంటర్వ్యూలు, చర్చా కార్యక్రమాల్లో తన వాణిని, సిద్ధాంతాలను జయప్రకాష్ నారాయణ బలంగా వినిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కూటమికి మద్ధతు ప్రకటించారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని, అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్లు అవుతుందని జగన్ పాలనపై చురకలంటించారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడమని జేపీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, ఒడిశాల కంటే దారుణంగా ఏపీ పరిస్ధితి తయారైందని జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, ఎన్నికల ఫలితాలపై జేపీ స్పందించారు. కక్షగట్టుకుని కొంతమంది సభలోకి రాకూడదు అన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని.. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో కనీసం రూ.10 వేల కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేశారని, దేశం మొత్తం మీద లక్షన్నర కోట్ల పైనే ఖర్చు పెట్టి ఉంటారని జయప్రకాష్ నారాయణ అన్నారు. మనదేశంతో పాటే సమాన సంపద కలిగిఉన్న బ్రిటన్‌లో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల మొత్తం ఖర్చు రూ.1000 కోట్లకు మించదని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ జనాకర్షణ కలిగిన పెద్ద నటుడని, సినిమాల్లో ఉంటే డబ్బులిచ్చి ఆయనను చూడాలని.. అదే రాజకీయాల్లోకి ఆయన డబ్బులు ఎదురివ్వాలని, తిట్లు తినాలి, అవమానాలు పడాలని జయప్రకాష్ నారాయణ అన్నారు. సమాజం బాగుపడాలనే ఆకాంక్షతో కష్టాలు భరించి , సంపదను, సంపాదనను పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారని పవన్‌పై జేపీ ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి వారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కూటమి లేకపోతే ఎన్నికల్లో ఓట్లన్నీ వృథా అయిపోతాయని గుర్తించి నమ్మిన లక్ష్యం కోసం పవన్ పోరాటం చేశారని ప్రశంసించారు.
దీర్ఘకాలికంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యం బాగుపడాలి, రాజకీయం మారాలనే లక్ష్యం దిశగా నడిచేందుకు పవన్ కళ్యాణ్‌కు అవకాశం లభించిందని జేపీ చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, సమూల మార్పు కోసం ప్రయత్నించాలని జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. 20 పార్టీలను కూడగట్టుకుని కేంద్రంలో అధికారాన్ని అందుకున్న వాజ్‌పేయ్ ఎన్నో విజయాలు సాధించారని, అయినప్పటికీ ప్రజలు ఆయనను ఓడించారని జేపీ గుర్తుచేశారు. పదవులతోనే అద్భుతాలు సాధించలేమని.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


Click it and Unblock the Notifications











