పవన్ కల్యాణ్‌కు వదిన సురేఖ వెల కట్టలేని గిఫ్ట్.. డిప్యూటీ సిఎంకు అత్యంత ప్రేమతో ఇచ్చినదేంటో తెలుసా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవితంలో మరో మెట్టెక్కుతున్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాస్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విపక్షనేతగా సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పాలకుడిగా తనదైన ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ఘన విజయానికి బాటలు వేయడమే కాదు.. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ అపూర్వ విజయంతో పవన్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరి కుటుంబ సభ్యుల పరిస్థితి, భావోద్వేగాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.
తన కుటుంబంలో తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య చిరంజీవి , వదిన సురేఖలకి పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవం ఇస్తారు. తల్లి అంజనా దేవితో ఎంత బాండింగ్ ఉంటుందో అదే చనువు సురేఖ వద్ద ఉంటుంది. కొణిదెల కుటుంబానికి పెద్ద కోడలిగా వచ్చే సమయానికి పవన్ చిన్న పిల్లాడు కావడంతో తన బిడ్డల్లాగే పెంచారు సురేఖ. తన వదినపై అభిమానాన్ని , అప్యాయతను ఎన్నో వేదికల మీద వెల్లిబుచ్చేవారు. చిరంజీవి సైతం పవన్‌ను తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా చూసుకుంటారు.

అలాగే తన కళ్ల ముందు పెరిగిన పవన్ కళ్యాణ్ గురించి సురేఖ తల్లి లాంటి బాధ్యతను నిర్వర్తించారు. పవన్ సినీ పరిశ్రమ వైపు రావడం వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. పవన్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంట్లోనే గడిపేవాడు. ఎప్పుడు చూసినా తనదైన లోకంలో రిజర్వ్‌డ్‌గా ఇంట్లోనే ఉండేవాడట.
వదినమ్మకు చేదోడు వాదోడుగా తలలో నాలుకలో ఉండేవారు పవన్ . ఆయనకు ఇష్టమైన వంటకాలు , అభిరుచులు, మనస్తత్వం సురేఖకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదంటారు సన్నిహితులు. తన ఎన్నికల అఫిడవిట్‌లోనూ వదిన సురేఖ గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఆమె వద్ద రూ.2 కోట్లు అప్పులు తీసుకున్నానని తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అపూర్వ విజయం సాధించి తొలిసారిగా ఇంటికి వెళ్లిన తర్వాత అన్న, వదినల ఆశీస్సులను అందుకున్నారు. ఆ తర్వాతే తల్లి అంజనా దేవి ఆశీర్వాదం తీసుకున్నారంటే అన్న వదినలకు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చెప్పనక్కర్లేదు .
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మరోసారి చిరంజీవి - సురేఖలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేనానికి మెగాస్టార్ దంపతులు అద్భుతమైన బహుమతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియోను '' కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి '' అనే పేరుతో చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.
ఆ గిఫ్ట్ ఏంటంటే .. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోంట్ బ్లాంక్ పెన్నును సురేఖ బహుమతిగా ఇచ్చారు. ఖరీదైన ఈ పెన్నును ఆమె పవన్ జేబులో అప్యాయంగా పెట్టారు. ఆ పెన్నుతో పాటు తాను తొలుత సంతకం పెట్టిన రూ.10 పెన్నును కూడా తన జేబులో ఉంచుకోవడం విశేషం. అంతేకాదు.. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అన్న వదిన అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











