పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పట్టి నారా తీస్తాం.. జగన్‌కు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ఆంధ్ర ప్రదేశ్‌లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఘాటైన ప్రసంగాన్ని చేశారు. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని కార్యకర్తల అరాచకాలపై వాడి వేడిగా స్పందించారు. తాజా జగన్ పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త..రపా రపా నరుకుతాం అనే పుష్ప 2 డైలాగ్‌తో కూడిన ప్లకార్డును పట్టుకొని విద్వేషాలను రెచ్చగొట్టడం, దానిని వైఎస్ జగన్ మద్దతు పలికినట్టు మాట్లాడటంపై జనసేన అధినేత గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధి జరుగాలని ఆకాంక్షించే వ్యక్తిని. విభజన గొడవల తర్వాత రాష్ట్రానికి ఏం జరిగిందో చూశాం. 2014 నుంచి 2019 వరకు పాలన చూశాం. ఆ తర్వాత 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రాభివృద్ధి విషయంలో నిర్మాణాత్మకంగా కాకుండా విధ్వంస పూర్వకంగా పాలన సాగింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు పాల్పడ్డారో చూశాం. రోడ్డు మీదకు వస్తే అరెస్టులు, ప్రజాస్వామ్య విధానాలను గుర్తించకుండా వ్యవహరించారు. అయితే తాజాగా పోలీసులను బెదిరిస్తూ.. మీరు ఏ దేశంలో ఉన్న తీసుకొచ్చి గుణపాఠం నేర్పుతామని బెదిరించడం చూస్తే చాలా దారుణం అనిపించింది.

మమ్మల్ని బెదిరించే వారికి ఒకటే సమాధానం. గొంతుకలు కోస్తాం. కుత్తుకలు కోస్తాం అలాంటి నినాదాలకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరు లేరు. అలాంటి వాటిని, మిమ్మల్ని ఎదుర్కొనే ఇక్కడికి వచ్చాం. అలాంటి పిచ్చి బెదిరింపులకు గానీ, పనికి మాలిన బెదిరింపులకు, తాటాకు బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి.. ఇంకా పద్దతిగా మాట్లాడుతున్నాం అని పవన్ కల్యాణ్ అన్నారు.
అన్ని విభాగాల అధికారులకు నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే.. సుపరిపాలనను అందించేందుకు కృషి చేయండి. లా అండ్ ఆర్డర్, కరప్షన్ లేకుండా మంచి విధానాలతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాను. చాలా మంది అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మళ్లీ ఆ ప్రభుత్వం వస్తే ఎలా అనుకొనే వాళ్లకు ఒకటే చెబుతున్నా. వాళ్ల ప్రభుత్వం మళ్లీ రాదు. రానివ్వం. అధికారులకు విశ్వాసం కలిగించేందుకు ఈ మాటలు చెబుతున్నాను. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లు ఉండాలని కోరుకొంటున్నాం. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది అని పవన్ కల్యాణ్ చెప్పారు.

గత ప్రభుత్వ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రోడ్ల మీదకు వచ్చి గొంతుకలు కోసేస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి. నిజ జీవితంలో ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి. కాలికి కాలి.. మక్కలిరగొట్టి కింద కూర్చోబెడుతాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. చిన్నపాటి విషయాన్ని కూడా సహించం. చాలా దెబ్బలు తిని వచ్చాం. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న భద్రత లేని పరిస్థితి అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.
సజ్జనుడికి కోపం వస్తే..అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు ప్రభుత్వం మెతక ప్రభుత్వం. సమర్ధమైన ప్రభుత్వం.అభివృద్ధి చేసే ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం. ఈ సభలో ఇలా మాట్లాడటం సంస్కారం కాదు. కానీ తప్పడం లేదు. ఎందుకంటే చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి.. మళ్లీ ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేస్తే సహించం. రాజ్యాంగ వ్యతిరేక పనులు, ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తే దయచేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలి అని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు.


Click it and Unblock the Notifications











