కొండగట్టుకు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పర్యటన.. ఎప్పుడు? ఏ రోజునంటే?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన దాదాపు ఖరారైందని ఆయన మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన తన మంత్రిత్వశాఖల రివ్యూ మీటింగులతో బిజీగా ఉన్న ఆయన తనను అభిమానించి ఓట్లు వేసిన ప్రజలను కలుసుకోవడానికి రెడీ అయ్యారు. ఆయన పర్యటన వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి అంటే పవన్ కల్యాణ్‌కు ఎనలేని భక్తి. ఆయన గతంలో పలుమార్లు హనుమాన్ భగవంతుడిని దర్శించుకొన్నాడు. ఏపీలో ఉన్నత పదవిని చేపట్టిన తర్వాత తెలంగాణలో కొండగట్టును దర్శించుకోవాలని నిర్ణయించారు.

ఇక తన అధికార కార్యక్రమాలను సమీక్షించుకొన్న తర్వాత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకొన్నారు. జూన్ 29వ తేదీన పవన్ కల్యాణ్ కొండగట్టులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన పూజలు చేసి తిరిగి హైదరాబాద్‌కు చేరుకొంటారు అని తెలిపారు.
ఇక తనకు ఘన విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు పవన్ కల్యాణ్ సిద్దమయ్యారు. జూలై 1వ తేదీన పిఠాపురం వెళ్లేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు.

జూలై 1వ తేదీన పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు పార్టీ వర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి పిఠాపురంకు పవన్ వస్తుండటతో జనసైనికుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











