మార్క్ శంకర్‌పై అసభ్య పోస్టులు .. అల్లు అర్జున్ అభిమాని అరెస్ట్, పవన్‌పై పగతోనే
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఆయన ప్రత్యర్ధులు పవన్ ఆయన భార్యాబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించడం, దారుణమైన పోస్టులతో ఇబ్బందిపెట్టారు. ఎన్నికల తర్వాత పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఇలాంటి వారు సైలెంట్ అయ్యారు. అయితే గత కొద్దిరోజులుగా కేటుగాళ్లు పవన్ కుటుంబాన్ని మరోసారి టార్గెట్ చేశారు.
పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుకుంటున్నాడు. అయితే చిన్నారి చదువుకుంటున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరగడంతో శంకర్ గాయపడ్డాడు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌కి ఈ సమాచారం తెలియడంతో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే ఆయన సింగపూర్ బయల్దేరారు. పవన్ కుమారుడికి ప్రమాద విషయం తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పార్టీలకు అతీతంగా నేతలు, సినీ ప్రముఖులు స్పందించారు.

ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండ్రోజుల క్రితం కుమారుడిని తీసుకుని పవన్ ఆయన సతీమణి అన్నా లెజ్‌నోవలు హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు. అయితే తన బిడ్డ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అన్నా లెజ్‌నోవా .. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు అర్పించడంతో పాటు తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అవసరమైన 17 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. అన్నదాన భవనంలో స్వయంగా భక్తులకు తన చేతితో వడ్డించారు కూడా.
భారతదేశానికి చెందిన వ్యక్తి కానప్పటికీ.. ఆమె పవన్ కళ్యాణ్‌తో వివాహం జరిగిన నాటి నుంచి హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో అన్నా లెజ్‌నోవా .. తిరుమల వెళ్లడం, తలనీలాలు సమర్పించడంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చివరికి సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేని చిన్నారి మార్క్ శంకర్ పవనోచ్‌పైనా విమర్శలు రావడంపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. మార్క్ శంకర్‌పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్‌గా గుర్తించారు. ఇతను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు వీరాభిమాని అని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఫ్యాన్ వార్‌లో భాగంగానే రఘు పోస్టులు పెట్టాడని ఎస్పీ వివరించారు. మొత్తం 4 మొబైల్స్, 14 ఈమెయిల్స్ ఆధారంగానే వీరు పోస్టులు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేశామని .. దర్యాప్తులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని గుంటూరు ఎస్పీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











