పవన్ కల్యాణ్ సినిమాలను అడ్డుకొంటాం.. తెలంగాణలో నిషేధిస్తాం.. భగ్గుమన్న తెలంగాణవాదులు
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. భవిష్యత్‌లో ఆయన నటించే సినిమాల రిలీజ్‌ను నైజాంలో అడ్డుకోవాలి. ఆయన సినిమాలపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు సోషల్ మీడియాలో ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం తరుఫున పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలేంటి? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లింది? ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణ వాదుల చేస్తున్న హెచ్చరికలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ఏపీలో జరిగిన ఓ సమావేశంలో గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో కొబ్బరిచెట్లు ఎండిపోయిన విషయం అందరిలోను ఆందోళనకు గురి చేసింది. వాటి గురించి తెలుసుకొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రాంతపు వారి నర దిష్టి తగలడం వల్లే కోన సీమంలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి ఉంటాయేమో అని ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ ప్రాంత వాదులు, నేతలు ఆయనపై మండిపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటింది. తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడకూడదు. ఆయన భేషరుతుగా క్షమాపణ చెబితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తరు. ఈ వివాదంతో చిరంజీవికి సంబంధం లేదు. ఆయన జెంటిల్మన్. కానీ పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలిసి తెలియక మాట్లాడారా? తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారా? ఈ విషయంలో భేషరుతుగా క్షమాపణ చెబితే కనీసం ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులైనా ఆడుతుంది. లేదంటే తెలంగాణ ఆయన సినిమా ఎక్కడా కూడా రిలీజ్ కాదు. సినమాటోగ్రపి మంత్రిగా ఈ మాట చెబుతున్నాను అని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ, ఆంధ్రా సోదరభావంతో మెదిలే రాష్ట్రాలు. తెలంగాణ ప్రాంతంలో వరదలు, తుఫాన్ వస్తే.. ప్రకృతి వైపరీత్యం అనుకొంటామే.. కానీ ఆంధ్ర ప్రజలను తప్పు పట్టడం లేదు. ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోతే.. తెలంగాణ వాళ్ల దిష్టి అని వ్యాఖ్యలు చేయడం ఆయన వివేకమో? అవివేకమో? అర్ధం కావడం లేదు. ఈ వ్యాఖ్యలపై జనసేన మిత్ర పక్షం బిజేపీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించాలి అని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ పౌరులను అవమానించినట్టే. వివేకంతో మాట్లాడాలి. ఇంకా నీవు సినిమా నటుడివి కాదు. ఏపీకి డిప్యూటీ సీఎంవి. బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలి. భేషరుతుగా క్షమాపణ చెప్పాలి అని పొన్నం సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











