Posani Arrest: పోసానికి ఎన్నేళ్లు జైలుశిక్ష? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్.. లాయర్ సంచలన వ్యాఖ్యలు
రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించడం సంచలనం రేపింది. పోసానిని జైలుకు తరలించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోసానిని జైలుకు తరలించిన తర్వాత ఆయన తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిల్ల కోడిని గద్ద తన్నుకుపోయినట్టు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పోసాని అరెస్ట్ దురదృష్టకరమైంది. అరాచక ప్రభుత్వం పాలకులు ఏలుతున్న పర్యవసానమే పోసాని అరెస్ట్. ఆయనపై సుమారుగా 16 కేసులు నమోదు చేశారు. ఆయన రిమాండ్‌ను అడ్డుకొనేందుకు సుమారుగా 5 గంటలపాటు సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈ ప్రభుత్వం హాయంలో ఒక్కొక్కరిపై 25 కేసులకు తక్కువ కాకుండా పెడుతున్నారు. పీటి వారెంట్ల పేరున ముద్దాయిని ఎక్కడెక్కడికి తిప్పుతున్నారు అని పొన్నవోలు అన్నారు.

వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలపై పోసానిపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయనపై 196, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనపై 111, 61 ఐటీ యాక్టు కింద నమోదు చేసిన సెక్షన్లు పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు చెప్పింది. గతంలో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం 7 ఏళ్లు లోపు శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసులో రిమాండ్‌కు తరలించకూడదనే జడ్జిమెంట్ ఉంది. దానిని కోర్టు ఉల్లంఘించింది అని ఆయన అన్నారు.
14 రోజులపాటు పోసానిని కడప జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టును ఆధారం చేసుకొని బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టులో, హైకోర్టులో దాఖలు చేస్తాం. రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్, కోర్టులో హాజరుపరిచేలా కేసులు నమోదు చేశారు. ఒకవేళ ఈ కోర్టులో బెయిల్ వచ్చినా.. మరో పోలీస్ స్టేషన్ వారు ఆయనను తీసుకెళ్లేవారు. కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోయినట్టు ఆయనను పలు స్టేషన్లకు తరలించే పరిస్థితి ఏపీలో ఉంది అని అన్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతున్నది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. నంది అవార్డుల కమిటీలో ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని అనడంతో పోసానిపై కేసులు నమోదు చేశారు. కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ విజయం సాధించలేదు. అలాగని మేము సక్సెస్ కాలేదు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా పోసాని వ్యవహారం సాగింది. ఈ కేసు రుజువైతే ముద్దాయికి 5 నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











