తప్పు చేయలేదు.. ఇంత ఘోరంగానా? రోజా సంచలన వ్యాఖ్యలు
సినీ నటి రోజా సెల్వమణి తొలిసారి మీడియా ముందుకు వచ్చి తమ ఓటమిపై విశ్లేషణ మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నగరిలో దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తన ఓటమి కారణం తెలుగుదేశం, జనసేన కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే అంటూ ఫలితాలకు ముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓటమి గురించి ఆమె నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె మాట్లాడిన వివరాల్లోకి వెళితే..
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దారుణంగా ఓటమిపాలు కావడంతో నటి, రాజకీయ నేత రోజా దాదాపు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రజా జీవితానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఆమె చుట్టూ వివాదాలు మాత్రం ఆగకపోవడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

ఇక ఓటమి తర్వాత విహారయాత్రలు, ఆలయాల్లో పూజలు చేస్తూ కనిపించారు. అక్కడా కూడా ఆమె వివాదాల్లో కూరుకుపోయారు. పారిశుద్ద కార్మికులనూ దూరంగా ఉండాలని చెప్పడం ఆమెకు ప్రజలంటే ఎంత ఇష్టమో అని సెటైర్ వేశారు. అలాగే విదేశాల్లో కురచ దుస్తుల్లో కనిపించడంతో.. గతంలో మహిళలంటే ఎలా ఉండాలో చెప్పిన వీడియోను ఉదహరిస్తూ ఆమెను ట్రోల్ చేశారు.
ఇదిలా ఉండగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా పోవాల్సినంతగా తప్పులు పార్టీ, నాయకత్వం చేయలేదు. ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోయినా.. ఏదో రోజు బయటకు వస్తుంది. ఆ రోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకొంటారు అని రోజా అన్నారు.
గత కొద్దికాలంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే ఆరోపణలతో ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 40 శాతం ఓట్లు పడినా మేము ఎలా ఓడిపోతామని పలువురు కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ కోణంలో చేసినవేనా అనే చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా, రోజా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ న్యూస్ జోరందుకొన్నది. సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలోకి చేరుతారనే ఊహగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











