'జగనే కాదు.. వైఎస్ కూడా తెలుగు హీరోలను అలా అవమానించారు'
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. అసలే కరోనా కారణంగా ప్రేక్షకుడు థియేటర్‌కు రావడమే కష్టమైన దశలో జగన్ నిర్ణయాల కారణంగా ఇండస్ట్రీ మరిన్ని సమస్యలు ఎదుర్కొంది. టికెట్ ధరలు తగ్గించడంతో పాటు ప్రభుత్వమే వెబ్ పోర్టల్ ద్వారా విక్రయాలు జరిపేలా జగన్ సర్కార్ కసరత్తు చేసింది. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎంతో కొంత ప్రయోజనం పొందేవారు. కానీ జగన్ అలాంటి వాటికి నో పర్మిషన్ అని చెప్పేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు 60 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది . అలాంటిది జగన్ దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో పరిశ్రమ పెద్దలు సమావేశమై ఆయనను బుజ్జగించాలని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ చూపి నాగార్జున , మహేశ్ బాబు, ప్రభాస్, దిల్‌రాజు వంటి వారిని తీసుకుని స్పెషల్ ఫ్లైట్‌లో బెజవాడలో దిగారు. అయితే తాడేపల్లి ప్యాలెస్ గేటు బయటే హీరోలు తమ కార్లను పార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ రావడాన్ని వారి హీరోలు, తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోదు.

తమ అభిమాన నటుల్ని జగన్ కావాలనే అవమానించారని అప్పట్లో సోషల్ మీడియాలో వారి అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. అదే సమావేశంలో తమను కనికరించాలని మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి జగన్‌ను వేడుకున్నారు. ఈ వీడియో బయట చక్కర్లు కొట్టడంతో మెగాభిమానులు నొచ్చుకున్నారు. ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయాన్ని వేదికలపై ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా, పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందరు హీరోల అభిమానులు జగన్ చర్యలతో రగిలిపోయారు.. దానికి ప్రతిఫలం ఏపీ ఎన్నికల్లో కనిపించింది.
లక్షలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టి చూసుకునే హీరోల విషయంలో జగన్ అలా అవమానకరంగా వ్యవహరించి ఉండాల్సింది కానీ సినీ, రాజకీయ వర్గాలకు చెందినవారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ హీరోలను ఇలా అవమానించడం ఇదే తొలిసారి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సొంత బిల్డింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సాయం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవాలని అనుకున్నామని మురళీ మోహన్ చెప్పారు.

పద్మాలయ, రామానాయుడు స్టూడియోల మధ్యలో ఉన్న 14 ఎకరాలలో ఒక ఎకరం ప్రభుత్వం తరపున కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని ఇండస్ట్రీ పెద్దలంతా నిర్ణయించారని చెప్పారు.
అయితే వైఎస్ వద్దకు తాను రాననని, నేను కనిపిస్తే ఆయన ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పానని మురళీ మోహన్ అన్నారు. అయినప్పటికీ వాళ్లంతా ఒత్తిడి చేయడంతో కాదనలేక ఓ మూలన కూర్చొన్నానని .. వైఎస్ఆర్‌కు విషయం చెప్పగా మీ అందరికీ కావాల్సిన స్థలం ఇచ్చే కెపాసిటీ మురళీ మోహన్‌కు ఉందంటూ సీఎం సెటైర్లు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఇండస్ట్రీ పెద్దలైన ఏఎన్ఆర్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులంతా ఓ 30 మందిమి వెళ్లడంతో రాజశేఖర్ రెడ్డి గ్రూప్ ఫోటో దిగుతామని అడగ్గా.. టైం లేదంటూ వెళ్లిపోయారని దీనిని మాత్రం అవమానంగా ఫీలయ్యామని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. అసోసియేషన్ నిధులు రూ.3 కోట్లు ఉండేవని ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీతో మా ఆఫీస్‌ను నిర్వహించామని మురళీ మోహన్ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications











