'తాడేపల్లి ప్యాలెస్ కట్టిచ్చింది నేనే.. సిఎం అయ్యాక జగన్ ముఖం చాటేశాడు'
తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి , మంచితనానికి మారుపేరు సూపర్‌స్టార్ కృష్ణ. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా .. తెలుగు తెరపై ఆయన వేసిన ముద్ర చెరిపోనిది. 350కు పైగా సినిమాల్లో హీరోగా , ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా, అత్యధిక మల్టీస్టారర్స్‌లో భాగమైన నటుడిగా కృష్ణ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సాంకేతిక సొబగులు అద్దారు.
తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్, తెలుగు కలర్ స్కోప్, తెలుగు సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం, తొలి డీటీఎస్ చిత్రాలు కృష్ణ అందించారు. హీరోగా, దర్శకుడిగా, స్టూడియో ఆధినేతగా, ఎడిటర్‌గా ఆయన సేవలందించారు. తన సినిమా వల్ల నష్టపోయిన దర్శక , నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎన్నోసార్లు ఆర్ధిక సాయం చేశారు. లేనిపక్షంలో ఫ్రీగా కాల్షీట్లు ఇచ్చి వారు కష్టాల్లోంచి బయటపడేందుకు అండగా నిలిచి మనసున్న మనిషిగా నిలిచిపోయారు. కృష్ణ వేసిన బాటలో నేడు ఎంతోమంది హీరోలు పంపిణీదారులను ఆదుకుంటున్నారు.

కృష్ణ విజయాల్లో ఆయన సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావు పాత్రలు కూడా అంతే కీలకం. కృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటే.. అన్నపై ఒత్తిడి లేకుండా వీరిద్దరూ అన్ని పనులు పూర్తి చేశారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ వ్యవహారాలను ఆదిశేషగిరిరావు, హనుమంతరావులే చూసుకునేవారు. కృష్ణ ఆదేశించడం ఆలస్యం వీరు చకచకా పని పూర్తి చేసేవారు. ఆయనపై ఈగ వాలినా సహించేవారు కాదు.. ఎదుటివారు ఎంతడివాడైనా సరే వదిలిపెట్టేవారు కాదు.
కృష్ణ సోదరుల్లో ఆదిశేషగిరిరావు అన్న అడుగుజాడల్లో రాజకీయాల్లోకి సైతం ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అయిన ఆయన దశాబ్ధాల పాటు ఆ పార్టీకి మద్దతుదారుడిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. చాలాకాలం ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణ అభిమాన సంఘాలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు, చిత్ర పరిశ్రమలో పరిచయాలతో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది. జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు సహా వీఐపీల రాకపోకలతో ఆ ప్రాంతం సందడి సందడిగా ఉండేది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో తాడేపల్లి ప్యాలెస్ బోసిపోతోంది. దీనికి తోడు ఇన్నాళ్లు ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్గం వెంబడి కఠిన నిబంధనలతో పాటు సామాన్యులు అడుగుపెట్టలేని పరిస్ధితి ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ మీదుగా వెళ్లే రహదారిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిలోని జగన్ నివాసానికి తానే ప్లాన్ చేశానని.. ఇల్లు, ఆఫీస్ డిజైన్లు ఎలా ఉండాలో తానే చెప్పానని వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో జగన్ లేకపోతే ప్రజలు ఒప్పుకోరని.. అందుకే తాడేపల్లిలో సొంతిల్లు కట్టుకోవాలని ఆయనతో చెప్పానని ఆదిశేషగిరిరావు వెల్లడించారు.
జగన్ కనీసం సైట్ కూడా చూడలేదని.. స్థల పరిశీలన, డిజైన్లు, నిర్మాణ పనులను తానే పర్యవేక్షించానని .. చివరిలో జగన్ గృహ ప్రవేశం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జగన్‌తో తనకు గ్యాప్ పెరిగిందని.. కానీ బయట కనిపిస్తే మాట్లాడేవారని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ వన్ సైడ్ విక్టరీ కొడతానని జగన్ భావించారని.. కానీ గ్రౌండ్ లెవల్‌లో పరిస్ధితిని ఆయన అంచనా వేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదిశేషగిరిరావు వ్యాఖ్యలు తెలుగు సినీ , రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.


Click it and Unblock the Notifications











