హిందూపురం జిల్లా ఏర్పాటు..బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పరిపాలనా సంస్కరణల్లో కొన్ని వైఎస్ జగన్‌కు తలనొప్పులు తీసుకొచ్చాయి. సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధ, నాడు - నేడు, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు వీటిలో కొన్ని. అలాగే పెరుగుతున్న జనాభాకు తోడు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలను విభజించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
నిపుణుల కమిటీ సిఫారసులు, సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజిస్తూ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం కొన్ని వర్గాల నుంచి వ్యతిరేక రావడంతో వివాదాస్పదమైంది. అయితే తాజా అలాంటి వివాదాస్పద అంశంపై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివారాల్లోకి వెళితే..

2022 ఏప్రిల్ 4న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కొత్త జిల్లాల నుంచి పరిపాలన మొదలైంది. పునర్వ్యవస్ధీకరణ వల్ల జిల్లాల సంఖ్య 13 నుంచి 26కి పెరిగాయి. పాత జిల్లాలు యథావిధిగా ఉండగా.. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి , కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయి.
అయితే జిల్లాల పునర్విభజన సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని కొన్ని సమస్యలు , అనేక డిమాండ్లు వేధించాయి. ఉదాహరణకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను విభజించి వాటిలో ఒకదానికి దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కాపులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ సర్కార్ దీనిని పట్టించుకోలేదు. అలాగే జిల్లాలకు పెట్టిన పేర్లు కూడా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని ఒక భాగాన్ని విడతీసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ అనే పేరుపెట్టగా ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో తీవ్ర విధ్వంసం జరిగింది.

అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం పాత జిల్లాలోనే ఉండగా దానిని అలాగే కొనసాగించి.. కొత్తగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఇక రాయచోటి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటనే ముఖ్యపట్టణంగా చేయాలని ఉద్యమాలు చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే లోక్‌సభ నియోజకవర్గాలైన నర్సాపురానికి బదులు భీమవరం.. హిందూపురానికి బదులు పుట్టపర్తిలను జిల్లా కేంద్రాలుగా చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్ సర్కార్ వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లగా , తర్వాత ఎన్నికలు , ఇతర కారణాలతో గొడవ సద్దుమణిగింది.
ఇలాంటి పరిస్ధితుల్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన అంశం చర్చనీయాంశమైంది. సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని చేయాలనే డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఒక్క హిందూపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు చాలానే ఉన్నాయని బాలయ్య తెలిపారు. జిల్లాల పేర్లు అలాగే ఉంచి, జిల్లా కేంద్రాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











