వైసీపీ అవినీతి అంతు చూస్తాం.. వైఎస్ జగన్ ప్రభుత్వ స్కామ్‌లపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కెరీర్‌లోనే అత్యంత ఉచ్ఛ స్థితిలో ఉన్నారు. నలుగురు పెద్ద హీరోలలో బాలయ్య ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన సినిమాల సక్సెస్ రేట్ ఓ రేంజ్‌లో ఉంది. బాలయ్య నటించిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు వరుసపెట్టి విజయం సాధించడంతో ఆయన లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్‌బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య లుక్, గెటప్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ -2లో బాలయ్య నటించనున్నారు.

సినిమాలు, షూటింగ్‌లతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాలయ్య చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. తన తల్లి బసవతారకం జ్ఞాపకార్ధం తన తండ్రి ఎన్టీఆర్ నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సమాజానికి సేవ చేస్తున్నారు. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ సాహసం చేయని వేళ ఓటీటీలోనూ బాలకృష్ణ సత్తా చాటుతున్నారు. ఆహా ఓటీటీలో ఆయన హోస్ట్‌గా రూపొందిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేతో సందడి చేశారు. రెండు సీజన్‌లలో స్టార్ హీరోలను ఆయన ఇంటర్వ్యూ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాలయ్య షో కారణంగానే ఆహాకు సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయని టాక్.
ఇక తండ్రి బాటలోనే రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు బాలకృష్ణ. నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి హిందూపురం నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బాలయ్య.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి హిందూపురంలో విజయం సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా ఇవాళ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు బాలయ్య.
ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మూడు రాజధానులంటూ కాలయాపన చేశారని, లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, తాము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని బాలయ్య హామీ ఇచ్చారు. ఇసుక, మద్యం, మైనింగ్‌లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని.. వారు చేసిన అవినీతి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. వారు చేసిన అవినీతిని బయటకు లాగి వారి అంతు చూస్తామని ఆయన చెప్పారు. బాలయ్య మాటలతో టీడీపీ, కూటమి శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











