వైఎస్ జగన్‌పై రఘురామకృష్ణంరాజు కేసు..సీఐడీ కస్టడీలో టార్చర్ ..ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?
టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపురం వైసీపీ టికెట్ సంపాదించిన రాజు గారు విజయం సాధించారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్దిరోజులకే పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల ధిక్కార స్వరం వినిపించారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విపక్షాలకు మించి ఘాటుగా విమర్శించేవారు. తొలుత మందలించి చూసినా రఘురామ హద్దు దాటడంతో నాటి కఠిన పెద్దలు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ పోలీసులు 2021 మేలో రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం సహా పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో తనను సీఐడీ అధికారులు చిత్రహింసలు పెట్టారని.. లాఠీలు, బెల్టులతో కొట్టారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఆయన కాళ్లు వాచిపోయి కనిపించడంతో పాటు నడవటానికి కూడా తీవ్ర ఇబ్బందిపడ్డారు. దీంతో సీఐడీ తీరుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.

తనని పోలీసులు కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఎంపీని కొట్టడం ఏంటీ, ఆయన శరీరంపై ఉన్న గాయాలు పోలీసులు కొట్టడం వల్లే ఏర్పడ్డాయని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రఘురామ కుమారుడు భరత్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తన న్యాయపోరాటాన్ని రఘురామకృష్ణంరాజు మరింత తీవ్రతరం చేశారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న తనపై సీఐడీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని, గుండెలపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేశారని ఆయన అన్ని పార్టీల నేతలకు లేఖలు రాశారు.
వైఎస్ జగన్ అధికారంలో ఉండటంతో తన కేసును నీరుగార్చేందుకు , ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని రఘురామ ఆరోపణలు చేశారు. దీంతో మరలా హైకోర్టును ఆశ్రయించి వైద్య నివేదికలు, విచారణకు సంబంధించిన ఫైళ్లను భద్రపరచాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లపై కేసులు పెట్టారు రఘురామకృష్ణంరాజు.

ఆయనపై అక్రమ కేసులు, చిత్రహింసలను క్షత్రియ సామాజికవర్గం తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. అయితే ఇంత జరుగుతుంటే ఆయనకు సమీప బంధువైన అగ్ర నటుడు ప్రభాస్ ఎలా స్పందించారనే దానిపై ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సినీనటులు రాజకీయాల్లోకి వేలు పెట్టకూడదని , రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం ఆ రంగంలోని వ్యక్తులకు అస్సలు మంచిది కాదని రఘురామ వ్యాఖ్యానించారు.
ప్రభాస్ అభిమానుల్లో అన్ని పార్టీలకు చెందినవారు ఉంటారని.. తేడా వస్తే అతని సినిమాలపై ప్రభావం పడుతుందన్నారు. సినీనటులకు కొన్ని కండీషన్స్ ఉంటాయని, వాటిని దాటి మాట్లాడటం చాలా కష్టమని రఘురామ పేర్కొన్నారు. ప్రభాసే కాకుండా భుజాలపై చేతులు మాట్లాడేంత చనువు ఉన్న స్టార్ హీరోలతో తనకు స్నేహా సంబంధాలు ఉన్నాయని.. అయినప్పటికీ వారి నుంచి ఓపెన్ స్టేట్‌మెంట్‌లు ఆశించడం తప్పని రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. స్నేహితులంతా బాగుండాలని కోరుకునే వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











