ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. అక్కినేని నాగార్జునపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెరపైకి వచ్చిన హైడ్రా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆక్రమణలు, అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)గా దీనికి నామకరణం చేసి అధికారాలను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న 27 పురపాలక సంఘాల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవపరమైన అధికారాలను ఇచ్చారు.
హైడ్రాకు అపరిమిత అధికారాలు
ముఖ్యమంత్రి అండదండలు, అపరిమిత అధికారాలతో హైడ్రా దూకుడుగా ముందుకెళ్లింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణను, కట్టడాలను కూల్చుకుంటూ ముందుకు వెళ్లింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను దీనికి అధిపతిగా నియమించగా.. ఆయన సమర్ధంగా వ్యవహరిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నగర పరిధిలోని పార్కులు, మైదానాలు, చెరువులను చాలా వరకు ఆక్రమణల నుంచి కాపాడింది హైడ్రా. హైడ్రా నుంచి నోటీసులు వస్తే చాలు బడాబాబులు వణికిపోయారంటే దీని పనితీరును అర్ధం చేసుకోవచ్చు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో టాలీవుడ్ షాక్
ఈ దశలో హైడ్రా తీరుకు నిరసనగా ఆందోళనలు కూడా వచ్చాయి. జనంతో పాటు కోర్టులు కూడా పలు కేసుల్లో హైడ్రాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా హైడ్రా టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ్మిడికుంటలోని 3 ఎకరాల విస్తీర్ణంలోని స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించారంటూ హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు.
కోర్టును ఆశ్రయించిన నాగార్జున
తుమ్మడికుంట జలాశయం దాదాపు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఎన్ కన్వెన్షన్‌ను 2010లో పది ఎకరాల్లో నిర్మించారు. ఈ పది ఎకరాల్లో 3 ఎకరాల 10 కుంటలను కబ్జా చేశారనేది హైడ్రా ఆరోపణ. ఈ కట్టడం అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతమ్ రెడ్డి పేర్లపై ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారంటూ బీఆర్ఎస్ హయాంలోనే ఫిర్యాదులు వచ్చాయి. గతంలో నాగార్జునకు నోటీసులు కూడా వెళ్లాయి. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే విధించింది. అయితే విషయం కోర్టు పరిధిలో ఉండగానే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్- నాగార్జున మధ్య గ్యాప్
ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. మధ్యలో నాగచైతన్య- సమంత విడాకులపై రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. అయితే నాగార్జున మాత్రం ఈ విషయాలను పక్కనపెట్టి.. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇటీవల తన రెండో కుమారుడు అఖిల్ పెళ్లికి స్వయంగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నాగార్జున. ముఖ్యమంత్రి కూడా స్వయంగా పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
నాగార్జునపై రేవంత్ రెడ్డి ప్రశంసలు
తాజాగా కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు కొత్తగా నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్‌ను రేవంత్ రెడ్డి జూన్ 28న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా ద్వారా చెరువుల్లో ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు దానిని గుర్తించి వారే స్వయంగా రెండెకరాలను నన్ను కలిసి చెరువుకు అప్పగించారు. నగర అభివృద్ధిలో నేనొక హీరోగా ముందుంటా.. మీరొక మంచి సంకల్పంతో ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని నాతో అన్నారు' అని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











