విజయశాంతికి బెదిరింపులు .. అన్ని బయటపెట్టి .. మిమ్మల్ని కసితీరా , దారుణంగా మెసేజ్
సీనియర్ నటి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు బెదిరింపులు రావడం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వీటిపై భయాందోళనలకు గురైన విజయశాంతి దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బెదిరింపులు, ఆ వ్యక్తి ఎవరు? తదితర వివరాలను పంచుకున్నారు విజయశాంతి దంపతులు.
విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌నని.. విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం కల్పించాలని కోరినట్లు శ్రీనివాస్ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకి డబ్బు ఇస్తే విజయశాంతి తరపున సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని శ్రీనివాస్ ముందు ప్రపోజ్ పెట్టాడు చంద్రకిరణ్. అయితే ముందు పనిచూసిన తర్వాతే అవకాశం కల్పిస్తానని శ్రీనివాస్ చెప్పడంతో చంద్ర కూడా సరేనని అన్నట్లుగా ఫిర్యాదులో తెలిపారు.

తొలుత బాగానే చేసినప్పటికీ గత కొంతకాలంగా చంద్రకిరణ్ తీరు శ్రీనివాస్ ప్రసాద్‌కు నచ్చలేదు. ముందుగా చెప్పిన విధంగా పనితీరు లేదంటూ అతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. అయితే విజయశాంతి పేరు వాడుకుని సినీ, రాజకీయ వర్గాల్లో చంద్రకిరణ్ రెడ్డి ప్రయోజనం పొందినట్లుగా శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతికి తానే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తుంటానిన చెప్పి రాజకీయ నాయకులతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలిపారు.
భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు చంద్రకిరణ్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని , పార్టీలో ఎదిగేందుకు అతను మమ్మల్ని వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత డబ్బుల కోసం చంద్రకిరణ్ మెసేజ్ పెట్టాడని.. అతని మెసేజ్‌లు చెప్పడానికి, రాయడానికి వీల్లేని విధంగా ఉన్నాయని శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ పోలీసులను కోరారు.
ఇదిలాఉండగా.. శ్రీనివాస్ ప్రసాద్‌కు ఇటీవల చంద్రశేఖర్ ఓ మెసేజ్ పెట్టాడు. తాను ఇన్ని రోజులు పని చేసినందుకు డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాడు. మన మధ్య ఎలాంటి ఒప్పందం లేనప్పుడు బకాయిలు ఏంటీ? డబ్బులు ఏంటీ? అని శ్రీనివాస్ ప్రసాద్ అడిగారు. దీనిపై ఇంటికొచ్చి తేల్చుకోవాలని ఆయన చెప్పగా.. చంద్రకిరణ్ పట్టించుకోలేదు. కానీ తనకు రావాల్సింది ఇవ్వకపోతే మీ పరువు తీసి రోడ్డు మీదకు లాగుతానని, కసితీరే వరకు మీ కుటుంబాన్ని చంపుతానని బెదిరింపు మెసేజ్‌లు పెట్టాడు. రోజురోజుకు అతని ప్రవర్తన దారుణంగా ఉండటంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి చంద్రకిరణ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఇకపోతే.. ఇటీవల విజయశాంతికి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ విజయశాంతి బిజీ అవుతున్నారు. తన వయసు, ఇమేజ్‌కు తగిన విధంగా పవర్‌ఫుల్ పాత్రలని ఎంచుకుంటున్నారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమాలో విజయశాంతి కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాల్లో విజయశాంతి చురుగ్గా పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications











