పవన్ కల్యాణ్ ఆ విషయం గుర్తుంచుకో.. నువ్వు తెలంగాణ వ్యతిరేకివే..
తెలంగాణ ప్రాంతపు ప్రజలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. ఇటీవల రాజోల్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దిష్టిపడటం వల్లే కోనసీమ ఎండిపోతున్నది అని అన్నారు. దాంతో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారంటూ తెలంగాణ వాదులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు భేషరుతు క్షమాపణలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత ఈ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతపు బిడ్డలు ఆత్మ త్యాగాలకు పాల్పడుతుంటే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకమే. ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా బాధాకరం. తెలంగాణ ప్రాంత నేతల దిష్టి కళ్ల వల్లే కోనసీమ పాడైంది అన్నారు. ఈ ప్రాంతపు ప్రజలు ఏనాడు దిష్టిపెట్టలేదు. కాకపోతే కోనసీమ ఎలా ఉందో.. అలా తెలంగాణ ప్రాంతాన్ని చేసుకొందామని అనుకొన్నాం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చిన్న మనసు ఉండదు. ఎప్పుడూ వారి హృదయం పెద్దది అని కవిత అన్నారు.

పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు కూడా విన్నవించుకొంటున్నాం. మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ కాలంలో మేము ఎప్పుడూ జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో.. ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకొన్నాం. లోక్‌సభలో నేను కూడా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాను. మేము ఎప్పుడూ కూడా పక్కోడి నుంచి గుంజు కోవాలని చూడం. పక్కోడు బాగుంటే కళ్లు మండవు. మేము బాగుండాలని కోరుకొంటాం అని కవిత అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలు అత్మ బలిదానాలు చేసుకొన్నారు తప్పితే.. పరాయి రాష్ట్రం వ్యక్తులపై చేయి ఎత్తలే. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో. ఆనాడు మీరు సినిమా యాక్టర్‌గా అంటే నడిచింది. ఈ రోజు మీరు డిప్యూటీ సీఎం. దేశవ్యాప్తంగా ఆంధ్ర ప్రజలకు రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలను ఆ ప్రాంతపు ప్రజలకు ఆపాదిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి అని కవిత అన్నారు.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆయనను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు. గతంలో చెగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ దిష్టి అనే పదాలు వాడుతున్నారు అని ఆయన సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











