ఒక్కో సినిమాకు కోట్లలో కమీషన్... టికెట్ రేట్ల పెంపుపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు మంజూరు చేయడం కలకలం రేపింది. దీనిపై కోర్ట్ సైతం మొట్టికాయలు వేయడంతో పాటు తీవ్రంగా పరిగణించింది. తాము ఎన్నిసార్లు చెబుతున్నా ప్రభుత్వం తీరు మారడం లేదని వ్యాఖ్యానించింది.
సినీ పరిశ్రమతో నాకు సంబంధం లేదు
మరోవైపు... తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెర్షన్ మరోలా ఉంది. తాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి, వాటి వ్యవహారాల గురించి పట్టించుకోవడం మానేశానని పేర్కొన్నారు. తనకు తెలియకుండానే టికెట్ రేట్ల పెంపు జీవోలు బయటకు వస్తున్నాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాతి నుంచి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతుల కోసం నా దగ్గరికి రావొద్దని ఆయన తేల్చిచెప్పారు. అప్పటి నుంచి ఎవరూ తనను కలవడం లేదని, అప్లికేషన్ కూడా పెట్టుకోవడం లేదని వెంకటరెడ్డి వెల్లడించారు. తాజాగా తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జనవరి 11న ఆయన సుధీర్ఘంగా పోస్ట్ పెట్టారు.

శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది
తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్
సీఎం రేవంత్ రెడ్డిగారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం.
ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అని హరీశ్‌రావు నిలదీశారు.
తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి
ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు. అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వడం లేదు
అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా? వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా? రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని హరీష్ అన్నారు.
కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారు
గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదని హరీశ్ తెలిపారు.
టికెట్ రేట్ల పెంపు వెనుక రాజ్యాంగేతర శక్తి
సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











