వైఎస్ జగన్‌కు ముఖం చాటేసి.. పవన్ కల్యాణ్ వద్దకు ఉత్సాహంగా.. కారణం అదేనా?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ పరిశ్రమలో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. గత ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీపై అనుసరించిన విధానాలు అత్యంత వివాదాస్పదం కావడం, ఆ విధానాలను పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నేచురల్ స్టార్ నాని అప్పట్లో వ్యతిరేకించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయాయి. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టినట్టు విమర్శలు ఎదుర్కొన్న వైఎస్ జగన్ ప్రభుత్వం దారుణంగా ఓటమి పాలు కావడం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంపై సినీ పరిశ్రమ ఘనంగా స్వాగతించింది. తాజాగా తెలుగు సినీ నిర్మాతలందరూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుసుకోవడానికి వెళ్లడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. నిర్మాతల భేటీ గురించిన వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడినా సినీ తారలు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం ఆనవాయితీ. ఆ సమయంలో తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం అధినేత కేసీఆర్‌ను కలిసి పరిశ్రమకు అండగా ఉండాలని సూచించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలువడానికి ముఖం చాటేశారు. దాంతో రెండు వర్గాల మధ్య అఘాతం పెరిగిపోయింది.
చివరకు టికెట్ రేట్లు, సినిమా పరిశ్రమ అభివృద్ధికి సహాయంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఇంకా కొంత మంది నిర్మాతలు వెళ్లిన సమయంలో వారిని అవమానించారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. దిగ్గజ నటులకు సరైన గౌరవం ఇవ్వలేదనే విమర్శలు ఏపీ ప్రభుత్వంపై వెల్లువెత్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ప్రభుత్వం అస్పష్టమైన విధానాలు, పొంతన లేని వాదనలతో సినీ పరిశ్రమను ఓ రకంగా వేధించిందనే చెప్పాలి. టికెట్ రేట్లు పెంచకుండా భీమ్లా నాయక్, శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాలకు మోకాలు అడ్డింది. దాంతో రిపబ్లిక్ సినిమా వేదిక నుంచి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది.
ఇక శ్యామ్ సింగ రాయ సినిమాకు టికెట్ రేట్లు పెంచకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవడంపై హీరో నాని సైటైర్లు సంధించాడు. సినిమా బాక్సాఫీస్‌ను చూస్తే.. పక్కన ఉన్న కిళ్లి కొట్టు రెవెన్యూ అంతా ఉండటం లేదు. సినిమా పరిశ్రమపై ఎందుకింత మీకు విద్వేషం అనే విధంగా కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యలు భారీ దుమారమే సృష్టించాయి.
ఇక పరిశ్రమకు సంబంధించిన నటులు కూడా తాజా ప్రభుత్వంలో భాగం కావడం కొంత సానుకూలత కనిపించింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోలు ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో సినీ పరిశ్రమకు కాస్త ఉత్సాహంగా మారింది. అందుకే కొత్త ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలువడానికి నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, నవీన్ ఎర్నేనీ తదితరులు విజయవాడకు వెళ్లారు. వారితో పాటు ఎమ్మెల్యే రఘురామరాజు కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











