నీ బెదిరింపులకు భయపడను.. అంబటి రాంబాబుకు టీజీ విశ్వప్రసాద్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. జగన్‌కు తొలి నుంచి చిత్ర పరిశ్రమతో అంతగా సత్సంబంధాలు లేవు.. ఆయన గెలిచినప్పుడు దిల్‌రాజు తప్పించి ఎవరూ వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేయలేదు. కరోనా ధాటికి థియేటర్లకు జనం రాని సమయంలో సినీ పరిశ్రమ ఎన్నో కష్టాలు పడింది. సరిగ్గా అప్పుడు టికెట్ ధరలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆధీనంలోనే ఈ వ్యవస్థ ఉండాలంటూ స్పెషల్ పోర్టల్ దిశగా కసరత్తు చేసింది జగన్ సర్కార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కక్షతో తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రీకి నష్టాలు తెచ్చిపెట్టాయి.
స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు ఏ రకంగానూ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. కష్టాలు మొరపెట్టుకుందామని చిరంజీవి సారథ్యంలోని సినీ ప్రముఖుల బృందం తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వస్తే వారిని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చారు. కోట్లాది మంది గుండెల్లో పెట్టి చూసుకునే హీరోల పట్ల ఇలా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు.. చిరంజీవి అంతటి వ్యక్తి స్వయంగా జగన్‌కు చేతులెత్తి మొక్కిన దృశ్యాన్ని ఎవరూ మరిచిపోలేరు. అలా అన్ని రకాలుగా జగన్ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడిందన్నది బహిరంగ రహస్యం.

తన ఒక్కడి కోసం మొత్తం సినీ రంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని పవన్ కళ్యాణ్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. అయితే నాటి జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు .. పవన్ కళ్యాణ్‌పై చెలరేగిపోయేవారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ - సాయిథరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాలో పొలిటికల్ పంచ్‌లు దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా థర్టీ ఇయర్స్ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ విమర్శల పాలైంది. ఓ పబ్‌లో ఓ హుషారైన పాటకు పృథ్వీ డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అతనిని ఆపి .. శ్యాంబాబు ఆ డ్యాన్స్ ఏంటీ..? వస్తున్న టెంపో ఏంటి..? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటీ..? అంటూ పంచ్‌లు విసురుతారు.
అయితే ఇది అంబటి రాంబాబును ఉద్దేశించి పెట్టిన పాత్రేనంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాంబాబు డ్యాన్స్ చేసినట్లుగానే థర్టీ ఇయర్స్ పృథ్వీ స్టెప్పులు ఉంటాయి. అంబటి వేసుకున్న టీ షర్ట్, ట్రాక్ మాదిరిగానే శ్యాంబాబు గెటప్ ఉంటుంది. దీంతో అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పేరుతో తన క్యారెక్టర్‌ను పెట్టి స్పూఫ్ చేశారని సీరియస్ అయ్యారు.

ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి బ్రో సినిమా ఫ్లాప్ అని చెప్పారు. ఆహా, ఓహో అని ఏవేవో లెక్కలు చెప్పడంతో కాదు.. తన దగ్గర అసలు లెక్కలు ఉన్నాయంటూ ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్లు చదివి వినిపించారు. పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్యాకేజ్ మొత్తాన్ని బ్రో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ద్వారా ఎన్ఆర్ఐల డబ్బును హవాలా మార్గంలో అందజేశారని రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తే గుణపాఠం చెబుతామని త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సైతం ఆయన వార్నింగ్ ఇచ్చారు.
దీనికి టీజీ విశ్వప్రసాద్ ఘాటుగా కౌంటరిచ్చారు. రాజకీయ పరమైన ఆరోపణలను తాను సీరియస్‌గా తీసుకోనని.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చానో చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. ట్యాక్సులకు సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని.. ఏజెన్సీలు వచ్చి అడిగితే లెక్కలు చూపిస్తామని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. తన మీద ఎక్కడ, ఎవరికి కంప్లయింట్స్ చేసినా పర్వాలేదని సొంతడబ్బుతోనే బ్రో సినిమా తీశానని ఆయన తేల్చిచెప్పారు.
అంబటి వల్ల తమ సినిమాకు పబ్లిసిటీ పెరుగుతుందని.. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. రాంబాబును కనుక తాను సీరియస్‌గా తీసుకుంటే అతనికి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసునని.. తన లీగల్ టీమ్ చాలా పవర్‌ఫుల్ అని టీజీ విశ్వప్రసాద్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ ఆదివారం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ, మీడియా రంగాలకు చెందినవారికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీజీ విశ్వప్రసాద్, రాంబాబు మధ్య నడిచిన మాటల యుద్ధానికి సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











