సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా.. లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్
థియేటర్లలో పర్సంటేజ్ విధానంతో టాలీవుడ్‌కు- ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. తన సినిమా రిలీజ్‌కు ముందు కావాలనే థియేటర్ల బంద్ ఇష్యూను తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అలాగే సినీ పరిశ్రమకు సైతం తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ పెద్దలు డైలమాలో పడ్డారు. రానున్న రోజుల్లో పెద్ద సినిమాల విడుదల ఉండటంతో ఏపీ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సరికాదని నిర్ణయానికి వచ్చారు.
జగన్ హయాంలో టాలీవుడ్‌కు ఇబ్బందులు
వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ ఎంతో ఇబ్బందికి గురైంది. టికెట్ల రేట్ల పెంపు లేకపోగా.. అత్యల్పంగా ధరలు ఉండటంతో సినీ పెద్దలు కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్ధితి ఉండేది. జగన్‌ను ఎదిరించే ధైర్యం లేక మౌనం వహించారు. ఒకదశలో టికెట్ల విక్రయాలు కూడా ప్రభుత్వ పోర్టల్ ద్వారా జరిగేలా వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. టాలీవుడ్‌కు సన్నిహితుడిగా ముద్రపడ్డ చంద్రబాబు సీఎంగా.. స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.

థియేటర్ల బంద్‌తో పవన్ ఆగ్రహం
నాటి నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి ఏం కావాలన్నా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించేది. అమరావతికి వచ్చి కలిస్తే చాలు పనులు చకచకా జరిగిపోయేవి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకే సినిమాటోగ్రఫి శాఖ ఉండటంతో సినీ పరిశ్రమకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందేవి. అంత సవ్యంగా సాగుతున్న దశలో థియేటర్ల బంద్ ఇష్యూ.. ఏపీ ప్రభుత్వానికి- టాలీవుడ్‌కు మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ సినిమాను ఆపే దమ్ము లేదన్న దిల్‌రాజు
సింగిల్ స్క్రీన్స్‌లో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల బంద్ దిశగా అడుగులు వేశారు. దీని వెనుక సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా ఉంటూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను శాసిస్తున్న నలుగురి పేర్లు తెర మీదకు వచ్చాయి. తను నటించిన హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుకున్న గుట్టు రట్టు చేయాల్సిందిగా ఆయన మంత్రి కందుల దుర్గేష్‌ను ఆదేశించడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. థియేటర్ల బంద్ ఉండదని ఫిలిం ఛాంబర్ ప్రకటన చేసింది. అలాగే బంద్ నిర్ణయం వెనుక తాము లేమని దిల్‌రాజు, అల్లు అరవింద్‌లు కూడా వివరణ ఇచ్చారు.
ఏం కావాలన్న ఫిలిం ఛాంబర్ ద్వారానే
ఈ పరిణామాలతో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు సినీ పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా కనీసం సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ సీఎం చంద్రబాబు నాయుడుని కలవలేదని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలోని థియేటర్లలో మౌలిక సదుపాయాలు, పన్ను రాబడి తదితర అంశాలు తేల్చాల్సిందిగా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇకపై సినీ ప్రముఖులు నేరుగా తనను కలవడానికి వీల్లేదని, ఏదైనా సరే ఫిలిం ఛాంబర్ నుంచే సంప్రదించాలని సూచించారు.
చంద్రబాబుతో భేటీ వాయిదా
దీంతో పవన్ కళ్యాణ్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలని భావించిన సినీ ప్రముఖులు .. సీఎం చంద్రబాబుతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నెల 15న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడింది. సినిమాల షూటింగ్‌లు, ఇతర కారణాలతో పలువును సినీ పెద్దలు ఇతర ప్రాంతాల్లో ఉంటంతో ఈ భేటీ వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో త్వరలోనే మరో రోజున సినీ పెద్దలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











