ఏపీ రాజధాని నిర్మాణంలోనూ పవన్ కల్యాణ్ ముద్ర.. రాజమౌళి కాకుండా అమరావతి కోసం ఆప్తమిత్రుడు!
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. పలు రాష్ట్రాల వారైతే మీకురాజధాని లేదంటగా అంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అక్కడికి వెళ్లిన వారిని హేళన చేస్తున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో పలు వేదికలపై ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసేవారు. 2014లో విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు చంద్రబాబు నాయుడు. దేశ విదేశాలకు చెందిన సంస్థలతో రాజధాని నిర్మాణాలపై పలు సూచనలు సలహాలు తీసుకున్నారు. అలా ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. తాత్కాలిక ప్రాతిపదికన సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు భవనాలను నిర్మించారు చంద్రబాబు.
ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టిన వైసీపీ అధినేత ..సీఎం కాగానే మాట మార్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు తీసుకొచ్చారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి తగినట్లుగానే అసెంబ్లీలో చట్టం సైతం చేసింది జగన్ సర్కార్. అయితే రాజధాని గ్రామాల రైతులు కోర్టులను ఆశ్రయించడంతో ఇది ముందుకు సాగలేదు. ఇదిగో వెళ్తున్నా, అదిగో వెళ్తున్నా అంటూ జగన్ కాలయాపన చేస్తూ వచ్చారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఈ అంశం అటకెక్కి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే నిలిచింది.

2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రహదారుల అభివృద్ది, ఇప్పటికే ప్రారంభమైన భవనాల నిర్మాణాన్ని గాడిలో పెట్టడం, రాజధానిలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, హైదరాబాద్ - అమరావతి ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్, నాగపూర్ - విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు ఇప్పటికీ ప్రారంభమయ్యాయి. విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు బైపాస్‌లతో అమరావతి రూపు రేఖలు మారిపోనున్నాయి.
ఇకపోతే.. అమరావతిలో భవనాల ఆకృతులకు సంబంధించి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు లండన్ వెళ్లొచ్చిన జక్కన్న.. పాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలపై నార్మన్ ఫోస్టర్ వర్క్ షాపును ఆయన ఆసక్తికరంగా తిలకించారు. అసెంబ్లీ భవనంలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసే ప్రతిపాదన రాజమౌళిదే. అమరావతి వంటి ఓ చారిత్రక కట్టడాల నిర్మాణంలో ఓ సినీ దర్శకుడి సలహాలు, సూచనలు తీసుకోవడం ఏంటని అప్పట్లో వైసీపీ ధ్వజమెత్తింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు.

ఇదిలాఉండగా.. కూటమి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి కావడంతో రాజధాని అమరావతిపై తన మార్క్ చూపించాలని ఆయన కూడా భావిస్తున్నారట. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిలు గన్నవరం ఎయిర్‌పోర్టులో కనిపించారు . ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సినిమాలను పక్కనబెట్టిన పవన్ కళ్యాణ్.. మరో మూడు నెలల వరకు తనను డిస్ట్రబ్ చేయొద్దని నిర్మోహమాటంగా చెప్పేశారు. అలాంటిది త్రివిక్రమ్, ఆనంద్ సాయిలు అమరావతికి రావడం ఆసక్తిగా మారింది.
తెలంగాణ తిరుపతి యాదాద్రి దేవాలయం నిర్మాణంలో ఆనంద్ సాయి కీలక భూమిక పోషించారు. యాదాద్రి నిర్మాణ అన్ని వర్గాల భక్తులు, ప్రజల నుంచి ప్రశంసలు అందుకొంటున్నది. దీంతో అమరావతి డిజైన్‌కు సంబంధించి ఆనంద్ సాయి, త్రివిక్రమ్‌ను పిలిపించారా..? వారితో కొత్త డిజైన్లు చేయిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. మరి ఈ పుకార్లకు చెక్ పడాలంటే పవన్, త్రివిక్రమ్, ఆనంద్ సాయిలలో ఒకరు స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











