వైఎస్ జగన్ జవాబు చెప్పు.. ఫ్రెండ్ కోసం అక్రమ కేసులా? ముంబై నటి వ్యవహారంపై షర్మిల ఫైర్
ముంబై నటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసులు, వేధింపుల వ్యవహారం మరింత సంచలనంగా మారింది. గత వారం రోజులుగా ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తు సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోను చర్చనీయాంశమైంది. ఇటీవల మీడియా కథనాల నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ఏపీలోని విజయవాడ కమిషనర్ ముందు తన స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కాదంబరి జెత్వాని ఓ మహిళ. నాకు తెలిసిన విషయం.. ఆమె ఒక డాక్టర్. విదేశాల్లోని విద్యాస్థంస్థలకు వైద్య రంగానికి సంబంధించిన స్టడీ పేపర్స్ కూడా రాశారు. ఆమె సినిమా రంగంలోకి వచ్చి నటించాలని అనుకొన్నది అని నాకు అర్దమైంది అని షర్మిల అన్నారు.

జెత్వానీ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ పెద్ద మనిషిపై ఆరోపణలు చేశారు. ఆమెను తొక్కాలని చూశారు. ఒకవేళ ఆ అమ్మాయి ఆయనను మోసం చేయాలని అనుకొంటే..అన్ని డబ్బులు ఇచ్చి ఆమె నోరు మూయించే వాడు. కానీ అలాంటి ఒత్తిడికి లొంగకుండా నాకు న్యాయమే జరగాలని నిలబడింది. ఆమెను దారుణంగా తొక్కాలని చూశారు అని షర్మిల చెప్పారు.
కాదంబరి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి నేవీ ఆఫీసర్. తల్లి రిజర్వు బ్యాంకులో ఉన్నతాధికారిగా పనిచేశారట. అలాంటి వారిని జైలులో పెట్టి ఎంత దారుణంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. 15 మంది ఆఫీసర్లు, పోలీసులు విమానంలో ముంబైకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారట అని షర్మిల వెల్లడించారు.
కాదంబరి లాంటి ఓ అమ్మాయిపై చేసిన పైశాచిక చర్యలు దారుణం. ఆమె నన్ను సహాయం కోరితే నా వ్యక్తిగత స్థాయిలో సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఈ విషయంపై సమాధానం చెప్పాలి అని షర్మిల నిలదీశారు.

కాదంబరి అక్రమ అరెస్ట్ వెనుక చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మీకు తెలియకుండా సమాజంలోని పెద్ద మనిషి పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్‌కు సాయం చేశారా? సజ్జన్ జిందాల్‌కు మీకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ఆయనే చెబుతున్నారు. మీ మధ్య స్నేహంతో ఇంత దారుణంగా దిగజారుతారని ఊహించలేదు అని షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఓ సందర్భంలో నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారికి అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో అని చెప్పిన వాడు. అక్రమ కేసులు పెట్టిన వ్యవహారంలో ఓ అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంటే.. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఫోర్జరీ కేసులో 15 మంది ముంబై వెళ్లి ఓ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











