వైఎస్ జగన్‌ను నిండా ముంచేశాడా? వేణుస్వామి జాతకం వికటించిందా?
ఏదో తనకొచ్చిన నాలుగు ముక్కలు జ్యోతిష్యం చెప్పుకుని.. నాలుగు పరిహారాలు సూచించి పదిమందికి మంచి చేయమని దేవుడు చెబితే లేనిపోని వివాదాల్లో తలదూర్చి పీకల మీదకి తెచ్చుకున్నారు వేణుస్వామి. నాగచైతన్య - సమంత సహా కొందరు సెలబ్రెటీల విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో జనాలకు వేణుస్వామి మీద గురి కుదిరింది. తమ జాతకాలు పట్టుకుని పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లడం , ఏదో పూజలు చేయించడంతో కొందరికి బాగా కలిసి రావడంతో హై ప్రొఫైల్ సర్కిల్స్‌లో వేణుస్వామి పేరు మారుమోగింది.
ఈ పాపులారిటీతో ఛానెల్స్‌లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ రావడంతో కొన్నాళ్ల పాటు ఆయన హవా నడిచింది. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గత కొద్దిరోజులుగా వేణుస్వామి ఏది పట్టుకుంటే అది ఎదురు తంతోంది. ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్‌కి పూర్తి విరుద్ధంగా రిజల్ట్స్ కనిపిస్తుండటంతో ట్రోలింగ్ బారినపడ్డారు. స్టార్ హీరో ప్రభాస్ జాతకం బాలేదని.. బాహుబలి తర్వాత చేసే సినిమాలు ఫట్ అవుతాయని చెప్పాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూవీస్ నిజంగానే బాక్సాఫీస్ వద్ద బోల్తాపటడంతో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే సలార్, కల్కిలు దిగి వసూళ్ల వర్షం కురిపించాయో ప్రభాస్ ఫ్యాన్స్‌కి వేణుస్వామి అడ్డంగా దొరికిపోయారు.

అదే కాదు.. తెలంగాణ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ విషయంలోనూ వేణుస్వామి చెప్పిన జోస్యానికి రివర్స్‌లో రిజల్ట్స్ రావడంతో ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య - శోభితాల వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్టులు మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమీషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనిపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.
రెండ్రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని.. రూ.5 కోట్లు ఇవ్వాలని వేధిస్తున్నాడంటూ వేణుస్వామి ఆయన సతీమణి వీణ శ్రీవాణి వీడియో రిలీజ్ చేయడం కలకలం రేపింది. అంత డబ్బు తాము ఇవ్వలేమని.. తమకు ఆత్మహత్యే శరణ్యమని ఈ జంట వాపోయింది. క్షణాల వ్యవధిలో ఈ ఆరోపణలకు కౌంటరిచ్చారు టీవీ5 మూర్తి. తాను వేణుస్వామి దంపతులను డబ్బులు అడిగినట్లు తేలితే.. తనను రాళ్లతో కొట్టి చంపాలంటూ సవాల్ విసిరారు.

ఈ వ్యవహారం మధ్యలో వైఎస్ జగన్ వ్యవహారం తెరపైకొచ్చింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆరు నూరైనా జగన్ సీఎం కావడం ఖాయమని వేణుస్వామి జ్యోస్యం చెప్పారు. అప్పట్లో జగన్‌తో వేణుస్వామి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. జగన్ కోసం వేణు ఏవో పూజలు చేయించాడని కూడా అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఆయన మాటలను ఎగ్జిటిపోల్స్ కంటే బలంగా నమ్మి ప్రచారం చేశాయి వైసీపీ శ్రేణులు.
కట్ చేస్తే ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో సగటు వైసీపీ కార్యకర్తు కూడా వేణుస్వామిని నమ్ముకుని నిండా మునిగిపోయామని వాపోతున్నారు. ఆయన మాటలతో భయపడ్డ జనం ఎక్కడ జగన్ గెలిచేస్తాడోనని.. తమ ఓటును టీడీపీకి వేశారని కొందరు ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉంటారు. అలా వేణుస్వామిని నమ్మి జగన్ అండ్ కో బొక్కబోర్లాపడ్డారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











