23 Movie Review: 23 తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: తేజ, తన్మయ, వేద వ్యాస్, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్, పవన్ రమేష్, ప్రణీత్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ రాచకొండ
నిర్మాత: స్టూడియో 99
సినిమాటోగ్రఫి: సన్నీ కూరపాటి
సంగీతం: మార్క్ కే రాబిన్
ఎడిటర్: అనిల్ ఆలయం
కథ: భరద్వాజ రంగవాజుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి
ఆర్ట్: విష్ణు వర్ధన్ పుల్లా
ఫైట్స్: రాజ్ కుమార్ మాస్టర్
డైలాగ్స్: ఇండస్ మార్టిన్
కాస్టింగ్ డైరెక్టర్: మహేశ్ గంగిమల్ల
రిలీజ్ డేట్: 2025-05-16
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు. పెళ్లి కాకుండానే శారీరకంగా ఏకం కావడంతో సుశీల గర్బవతి అవుతుంది. ఇడ్లీ సెంటర్ పెట్టాలనుకొన్న సాగర్‌కు అన్నీ ప్రతికూలంగా మారుతాయి. దాంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగా అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చి సుశీలను పెళ్లి చేసుకోవడానికి తన స్నేహితుడు దాస్‌తో కలిసి బస్సు దోపిడి చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ దోపిడికి వెళ్తే వారితో విధి మరోలా ఆటలాడి వారిని బస్సు దహనం సంఘటనలో 23 మంది మరణానికి కారణమవుతారు. ఈ కేసులో కోర్టు వారికి మరణశిక్ష విధిస్తుంది.

ఇడ్లీ కొట్టు పెట్టాలనుకొన్న సాగర్‌కు రుణం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈజీ మనీ సంపాదించడానికి ఎలాంటి వ్యసనాలు అలవాటు చేసుకొన్నాడు? అప్పుల బారిన పడి బస్సు దోపిడికి వెళ్లి కేసులో ఎలా ఇరుక్కుపోయారు? బస్సు దహనం కేసుతో వారికి సంబంధం ఉందా? కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత సాగర్, సుశీల కుటుంబాల పరిస్థితి ఏమిటి? సాగర్, దాస్‌కు మరణశిక్ష విధించారా? చివరకు వారికి జరిగిన న్యాయన్యాయాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే 23 సినిమా కథ.
సంఘంలో డబ్బు, పరపతి, కులం అనే అంశాలను బట్టే కోర్టులో తీర్పులు, న్యాయం జరుగుతుందనే అపవాదు ఎప్పటి నుంచో అందరిలోనే ఉంది. అలాంటి అనుమానాలకు తావిచ్చే బలమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని Box Office Closing Collections కథను ఎంచుకొన్నారు. సమాజాన్ని ఆలోచింపజేసే అంశాలతో దర్శకుడు రాజ్ రాచకొండ రాసుకొన్న పాయింట్స్ బాగున్నాయి. కానీ కథ, సంఘటనలు, ప్రత్యక్ష అనుభవాలు, పరిశోధనలో తెలిసిన వాస్తవాలను ప్రేక్షకుడికి చెప్పాలనే తాపత్రయం కారణంగా ఎమోషన్ స్టోరీని కొన్ని చోట్ల డాక్యుమెంటరీగా మార్చేశాడనిపిస్తుంది.
గుంటూరు జిల్లాలో 1991 సంవత్సరంలో దళితులపై అగ్ర వర్ణాలు దాడి చేసి 8 మందిని హత్య చేస్తారు. కానీ అగ్రవర్ణాల వారిని కోర్టు ఎలాంటి శిక్ష లేకుండా వదిలేస్తుంది. ఇక 1997 సంవత్సరంలో పరిటాలను హత్య చేయడానికి మద్దెల చెరువు సూరి చేసిన జూబ్లీహిల్స్ బాంబు కేసులో 28 మంది మృత్యువాత పడుతారు. కానీ నిందితులకు సత్ప్రవర్తన పేరుతో శిక్ష నుంచి మినహాయింపు పొందుతారు. కానీ చిలకలూరిపేట బస్సు దహనం కేసులో సాగర్, దాస్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందనే సాక్ష్యాలు లేకపోయినా మరణశిక్ష విధిస్తారు. అందుకు కారణం వారిద్దరూ తక్కువ కులం కావడమే అనే అనుమానం కలుగుతుంది. ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే వారికి ఓ న్యాయం.. అణగారిన ప్రజలకు కోర్టుల తీర్పు మరోలా ఉంటుందనే పాయింట్‌పై దర్శకుడు రాజ్ ఆర్ సెటైరిక్‌గా కథను చెప్పే ప్రయత్నంలో నిజాయితీ కనిపిస్తుంది. కానీ కథను ఎంత వరకు చెప్పాలి? సన్నివేశాలను ఎంత గ్రిప్పింగ్ చూపించాలనే విషయం నుంచి ట్రాక్ తప్పి..నిజాయితీగా వాస్తవాలను చెప్పాలని చేసిన ప్రయత్నం వల్ల నిందితులపై ఎలాంటి సానుభూతి రిజిస్టర్ కాలేకపోయిందని అనిపిస్తుంది.
కథలో సాగర్, సుశీల పాత్రలు అత్యంత భారమైనవి.. ఎలాంటి అనుభవం లేకున్నా.. తమ ప్రతిభతో వాటిని సజీవంగా మార్చడంలో తేజ, తన్మయ సక్సెస్ అయ్యారు. దాదాపు ఎక్కువ భాగం కథలో భావోద్వేగాలను పండించడంలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఇక యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్ లాంటి పేరున్న ఆర్టిస్టులు తమ టాలెంట్, నటనతో సినిమాకు మరింత బలాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు తపన పడ్డారు. పాపులర్ యాక్టర్లు లేరనే లోపాన్ని లేకుండా తమదైన శైలిలో సినిమాకు వందశాతం న్యాయం చేశారు. కథలో ఉండే మట్టి వాసనను గుభాలింప చేశారు.
23 మూవీ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, దర్శకత్వం విభాగాలు బలంగా నిలిచాయి. సన్నీ కూరపాటి చిత్రీకరించిన సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. లైటింగ్, బ్యాక్ డ్రాప్‌కు ఉపయోగించిన వాతవారణం కథకు యాప్ట్ అయిందనిపిస్తుంది. మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పాటలు వినగానే క్యాచీగా లేకపోయినా.. దృష్టి వింటే మంచి సాహిత్యం వినిపిస్తుంది. ఎడిటర్ అనిల్ ఆలయం కొంత కఠినంగా వ్యవహరించి కత్తెర్లు భారీగా వేసి ఉంటే.. సినిమాలో వేగం పెరిగేది. ఎమోషన్స్ పండేవనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రాజకీయంగా పలుకుబడి ఉండే వారికి కోర్టులు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం అందిస్తాయనే విమర్శలను మరోసారి గుర్తు చేసే ప్రయత్నమే 23 సినిమా. బస్సు దహనం సంఘటనలో తప్పుఒప్పులు పక్కన పెడితే.. చుండూరులో 8 మందిని చంపిన అగ్ర కులాల వారికి ఓ న్యాయం.. జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో నిందితులకు మరో న్యాయం కోర్టులు, ప్రభుత్వాలు అందించడాన్ని ఎత్తి చూపడంలో దర్శకుడు రాజ్ సక్సెస్ అయ్యారు. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా హానెస్ట్‌గా స్టోరిని చెప్పడానికి ప్రయత్నించినందుకు ఆయనను అభినందించాలి. స్క్రిప్టులో, కథను నడిపించిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నా పట్టించుకోకుంటే.. ఈ సినిమా కథలోని సారం బోధపడుతుంది. అన్ని విషయాలను ఒకే చూపుతో చూడొద్దంటారు. మీ దృష్టిని, ఆలోచనను మార్చుకొని ఈ సినిమా చూస్తే.. తప్పకుండా 23 మూవీ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











