Aa Okkati Adakku Review పెళ్లికాని ప్రసాదులకు అల్లరి నరేష్ మెసేజ్ ఏంటి? ఆ ఒక్కటీ అడక్కు సమీక్ష
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, అరియానా గ్లోరి, జామీ లీవర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, గౌతమి, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం: అంకం మల్లి
నిర్మాత: రాజీవ్ చిలక
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
సినిమాటోగ్రాఫర్: సూర్య
ఎడిటర్: చోటా కే ప్రసాద్
రిలీజ్ డేట్: 2024-05-03
గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) నిజాయితీ, నిస్వార్తంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగి. అయితే వయసు మీద పడినా పెళ్లికాని ప్రసాద్. తన సోదరుడికి పెళ్లి జరిగిన ఓ బిడ్డ కూడా పుడుతుంది. కానీ గణపతికి మాత్రం పెళ్లి కాదు. అయితే దాదాపు 50కి పైగా పెళ్లి చూపులు జరిగినా.. సంబంధం కుదరదు. దాంతో పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ (పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థ)ను కలుస్తాడు. అక్కడ పనిచేసే సిద్ది (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. అయితే గణపతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ది నిరాకరిస్తుంది.
వయసు మీద పడినా కానీ గణపతి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తమ్ముడి పెళ్లి చేసి తాను ఎందుకు చేసుకోలేదు? ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి? గణపతి మ్యారేజ్ ప్రపోజల్‌ను సిద్ది ఎందుకు రిజెక్ట్ చేసింది? మ్యాట్రిమోనియల్ సంస్థల అరాచకాల వల్ల యూత్ ఎలా బలైపోతున్నది? మ్యారేజ్ బ్యూరోలలో అసలు ఏం జరుగుతున్నది? అనే ప్రశ్నలకు సమాధానమే ఆ ఒక్కటీ అడక్కు సినిమా కథ.

ఆ ఒక్కటీ అడక్కు సినిమా అనగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ తీరా ప్రేక్షకుడు థియేటర్లలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడక్కడ నవ్వుల పూలు పూయించారే కానీ.. అంతగా కడుపుబ్బ నవ్వించే హాస్యం ఉండకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఇక పెళ్లి సంబంధాల మాటున మ్యారేజ్ బ్యూరోలు చేసే అరాచకాల లాంటి సీరియస్ సబ్జెక్ట్ చుట్టూ తిరగడం వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఈ పాయింట్ చుట్టూ మంచి కామెడీ అల్లుకోవడానికి స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ దిశగా ఆలోచించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది.
ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే.. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ అక్కడక్కడ బ్రహ్మండంగా పేలింది. హాస్యం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసి ఉన్న గణపతి రోల్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ నరేష్ అంటే ఫుల్ కామెడీ అనుకొని వచ్చిన వాళ్లు మాత్రం డిస్సాపాయింట్ అవుతారు. ఇక ఫరియా అబ్దుల్లా ఫర్వాలేదనిపించింది. ప్రముఖ కమెడియన్ జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడం దారుణం. ఆమెను మరదలి పాత్రలో కంటే.. మ్యారేజ్ బ్యూరోలో ఏదైనా క్యారెక్టర్ పెట్టి ఉంటే.. సినిమాకు మరింత వినోదం యాడ్ అయి ఉండేదనిపించింది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు. గౌతమి అతిథి పాత్రతో ఆకట్టుకొన్నది.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గోపి సుందరం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అబ్బూరి రవి మాటల్లో పదును, హాస్యం కొరవడింది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్‌లో కొన్ని కత్తెర్లు వేయడానికి అవకాశం ఉందనిపిస్తుంది. నిర్మాత రాజీవ్ చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పెళ్లి సంబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే ఓ తరహా కామెడీ, సీరియస్ సబ్జెక్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. కామెడికి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్. కానీ హాస్యానికి పెద్ద పీట వేయడంలో విఫలమయ్యారు. కానీ ఓ సందేశం ఉన్న సినిమా. అల్లరి నరేష్ అభిమానులు, కుటుంబ సమేతంగా ఏదైనా సినిమా చూడాలనుకొనే వాళ్లు.. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ వారం ఈ సినిమా ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications











