Aap Jaisa Koi Movie Review: ఆప్ జైసా కోయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మాధవన్, ఫాతీమా సనా షేక్, సచిన్ కావేథమ్, ఆయేషా రజా మిశ్రా, మనీష్ చౌదరీ, నమిత్ దాస్, దీపిక సింగ్, దివ్యమ్ దూబే తదితరులు
దర్శకత్వం: వివేక్ సోని
నిర్మాతలు: కరణ్ జోహర్, ఆధార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా
సినిమాటోగ్రఫి: దేబోజిత్ రే
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్, రోచక్ కోహ్లీ
ఎడిటర్: ప్రశాంత్ రామచంద్రన్
బ్యానర్: ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-07-11
శ్రీరేణు త్రిపాఠి అలియాస్ శ్రీ (మాధవన్) జమ్‌షెడ్‌పూర్‌లోని ఓ స్కూల్‌లో సంస్కృత టీచర్. చిన్నతనంలో తన క్లాస్‌మేట్‌కు లవ్ ప్రపోజల్ చేస్తే ఆమె శ్రీకి శాపం పెడుతుంది. దాంతో మానసికంగా అదే ఫీలింగ్‌లో ఉన్న శ్రీరేణు 43 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా బ్రహ్మచారి (వర్జిన్)గానే ఉండిపోతాడు. అయితే తన స్నేహితుడు దీపక్ (నమిత్ దాస్) సలహాతో ఆప్ జైసా కోయి (AJK) అనే డేటింగ్ యాప్‌కు కనెక్ట్ అవుతాడు. ఆ యాప్‌లో అర్ధరాత్రి అమ్మాయితో రొమాంటిక్ చాటింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కోల్‌కత్తాకు చెందిన 32 ఏళ్ల పెళ్లికాని ఫ్రెంచ్ టీచర్ మధుబోస్ (ఫాతీమా సనా షేక్)తో పెళ్లి చూపులు జరిగిపోతాయి. అయితే అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో నిశ్చితార్థం రోజు మధు బోస్‌ను పెళ్లి చేసుకోవడానికి శ్రీ నిరాకరిస్తాడు.

చిన్నతనంలో శ్రీరేణుకు అమ్మాయి పెట్టిన శాపం ఏమిటి? 42 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడు? ఆప్ జైసా కోయి అనే యాప్‌లో అమ్మాయితో ఎలాంటి ఛాటింగ్ చేశాడు. మధుబాలను చూసి ఎందుకు పెళ్లికి ఒప్పుకొన్నాడు? నిశ్చితార్థానికి ముందు మధు, శ్రీ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ నడిచింది. నిశ్చితార్థం రోజున మధుతో పెళ్లికి ఎందుకు నిరాకరించాడు? మాజీ ప్రియుడి ఎంట్రీతో మధు జీవితంలో ఎలాంటి ట్విస్ట్ చోటుచేసుకొన్నది? తన వదిన కుసుమ్ (ఆయేషా రజా), అన్న భాను (శ్రీరామ్ భగ్నానీ)కి వైవాహిక విభేదాలు ఎందుకు వచ్చాయి? అన్నా వదినల కాపురంలో చోటు చేసుకొన్న ట్విస్ట్ ఏమిటి? చివరకు శ్రీ, మధు రిలేషన్ ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఆప్ జైసా కోయి సినిమా కథ.
40 ఏళ్లకుపై బడిన మాధవన్‌తో ప్రేమ, పెళ్లి కధ ఏమిటి? అనుకొనే వారికి దర్శకులు వివేక్ సోని ఆయన వయసుకు తగిన కథను సినిమాకు ముఖ్యమైన పాయింట్‌గా ఎంచుకొని, దాని చుట్టూ లవ్, ఎమోషన్స్, కుటుంబ బంధాలు లాంటి అంశాలతో స్టోరిని నడిపిన విధానం బాగుంది. 42 ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్ శ్రీ జీవితంలో అనూహ్యంగా చోటు చేసుకొన్న సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. కథ రొటీన్‌గా సాగినా.. ఎమోషన్స్ కొత్తగా ఉంటాయి. శ్రీ, మధు బ్రేకప్ ఓ వైపు కొనసాగుతుండగానే.. తన అన్న భాను క్యారెక్టర్ కథను మరో జోన్‌లోకి తీసుకెళ్తుంది. రెండు రకాల ఎమోషన్స్‌ను వివేక్ సోని చక్కగా బ్యాలెన్స్ చేసింది. రెగ్యులర్ ఫ్యామిలీ కథలో నేటి జనరేషన్‌కు తగినట్టుగా డేటింగ్ యాప్ వ్యవహారం కథలోకి తెచ్చి.. ఆ పాయింట్‌ను సినిమాను మలుపు తిప్పే అంశంగా మార్చడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిసిస్తుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి.. వయసు మళ్లిన పాత్రలు, తన వయసుకు తగిన పాత్రలతో మాధవన్ ఇంతకు ముందు ఎన్నో ఫీల్‌గుడ్ సినిమాలను అందించాడు. ఆప్ జైసా కోయి సినిమాలో కూడా స్కూల్ టీచర్‌గా, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పరిమితులు, ఆలోచనలు ఉండే వ్యక్తిగా, పెళ్లి కోసం నిజాయితీగా ప్రయత్నించే యువకుడిగా.. వదిన కోసం అండగా నిలబడే మరిదిగా ఇలా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను చాలా సమర్ధవంతంగా పోషించాడు. కానీ ఆ పాత్రకు పరిధిని మించి తన ప్రతిభను చాటుకోవడానికి స్కోప్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్‌కు తగినట్టుగానే నటించాల్సి వచ్చిందనిపిస్తుంది. ఇక మధు బోస్‌గా, మెచ్యుర్డ్ యువతిగా ఫాతీమా సనా షేక్ అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. మహిళా సాధికారిత ఫ్లేవర్ ఉన్న కథలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. మిగితా పాత్రల్లో నటించిన వారంతా సినిమాకు బలంగా నిలిచారు.
ఆప్ జైసా కోయి సినిమా అంతా జెమ్‌షెడ్‌పూర్, కోల్‌కత్తా నగరాల్లో జరుగుతుంది. ముఖ్యంగా కోల్‌కత్తా నగరాలను దెబోజిత్ రే చక్కగా చూపించాడు. హౌరా బ్రిడ్జీ, విక్టోరియా మహల్, ఇతర నగర అందాలు స్టోరి మూడ్‌కు ఉపయోగపడ్డాయి. దేబోజిత్ రే సినిమాటటోగ్రఫి భాగుంది. జస్టిన్ ప్రభాకర్, రోచక్ కోహ్లీ మ్యూజిక్ బాగుంది. ప్రశాంత్ రామచంద్రన్ కథను ఎమోషనల్‌గా చెప్పడానికి సన్నివేశాలను పేర్చిన విధానం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రతిష్టకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. పాత్రలకు తగినట్టుగా కొత్త నటీనటులతో టాలెంట్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ, పెళ్లి, బంధాలు, అనుబంధాలు అనే పాయింట్‌తో మేల్ ఇగో అంశం చుట్టూ తిరిగే రెగ్యులర్, రొటీన్ కథ ఆప్ జైసా కోయి. డేటింగ్ యాప్ థీమ్‌తో కథలో కాన్‌ఫ్లిక్ట్ జొప్పిచిన విధానం బాగుంది. మహిళ ఏదైనా చేయాలంటే పురుషుడి అనుమతి కావాలా? మగవాడు చేసిన పనే ఆడది చేస్తే తప్పా? అనే పాయింట్లు కథను ఆసక్తిగా కనిపిస్తుంది. కథ, కథనాలు విభిన్నంగా లేకపోయినా.. నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు కొత్తదనాన్ని, ఫీల్‌ను తీసుకొచ్చాయి. సినిమా చూసినంత సేపు మంచి ఫీలింగ్, అనుభూతి కలుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తగినంత సమయం చూసుకొని ఒకే స్ట్రెచ్‌లో సినిమాను చూసేయండి. ఓ మంచి అనుభూతి కలుగుతుంది. మాధవన్, ఫాతీమా మిమ్మల్ని నిరాశపరచరని అనుకొంటున్నాను.


Click it and Unblock the Notifications











