అందరి వాడు 'ఆప్తుడు'

నటీనటులు: రాజశేఖర్, అంజలా జవేరి, ముఖేష్ రుషి,
సునీల్,సత్యనారాయణ, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రాళ్ళపల్లి,ఎమ్మెస్ నారాయణ
సంగీతం: రమణ గోగుల
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: జీవిత రాజశేఖర్
విడుదల తేదీ: 23 అక్టోబర్ 2004
'ఘాతక్' హిందీ చిత్రాన్ని మక్కికి మక్కి తెలుగులోకి దింపిన 'ఆప్తుడు' హిట్ చిత్రం. వరస పరాజయాలతో కుంగిపోయిన రాజశేఖర్‌కు రిలీఫ్ ఇచ్చే చిత్రమిది.
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి(చంద్రమోహన్) ని హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చేర్చి 'రౌడీయిజం' అనే క్యాన్సర్ సోకిన సామాజిక వ్యవస్ధకు చికిత్స చేసిన ఒక గ్రామీణ యువకుడి కథ ఇది. స్వాతంత్య్ర సమరయోధుడి పెంపుడు కొడుకు బోసు ( రాజశేఖర్) పేరుకు తగ్గ యువకుడు. గాంధేయ వాది. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తండ్రి పట్ల సమాజం చూపుతున్న నిరాదరణ హీరోను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మార్చుతుంది. రౌడీయిజాన్ని ఎదిరించే సాహసం చేసి విజయం సాధిస్తాడు. తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నగరంలోని ఒక కాలనీలో ఉంటున్న అన్నను చూద్దామని హీరో వెళ్తాడు. అన్నగారి ఇంటికి గంగిరెడ్డి అనే బడా రౌడీ కబ్జా పెడతాడు. ఎదురు తిరిగిన ఒక వ్యక్తిని దారుణంగా చంపేస్తాడు. ఈ నేపధ్యంలో సీన్‌లోకి వచ్చిన బోసు గంగిరెడ్డిని ఎదిరిస్తాడు. కోర్టులు, పోలీసు స్టేషన్లు అన్యాయాలను అరికట్టలేకపోవడంతో బోసు 'యాక్షన్'లోకి దిగుతాడు. గంగిరెడ్డి అపహరించుకుపోయిన తన అన్న కూతురిని విడిపించుకు వస్తాడు. అదే కాలనీలో ఉంటున్న హీరోయిన్ అంజలా జవేరి హీరోకి గైడ్‌లా సహాయపడుతుంది. విలన్ ఎత్తులకు తన అనుచరులతో పైఎత్తులు వేసి చిత్తు చేసే హడావుడిలో తండ్రి, అక్క మరణిస్తారు.
చాలా విరామం తర్వాత ముత్యాల సుబ్బయ్య-రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 'అన్న'ను తలపిస్తుంది. విలన్ విచిత్రంగా ఇళ్ళు ఖాళీ చేయమని కాలనీ వాసులను బెదిరిస్తాడే కానీ బలవంతంగా ఖాళీ చేయించడానికి సాహెసించడు. 'టైటిల్'లో ఉన్నా ఆ కాలనీలో ఎవరూ రాజశేఖర్‌ను 'ఆప్తుడు'గా పరిగణించకపోవడం స్క్రీన్‌ప్లేలోని చిన్న లోపం.
హీరోని ఎవరూ నమ్మరు. సహకరించరు. హీరోయిన్ అంజలాది, కమెడియన్ సునీల్‌లవి సపరేట్ ట్రాక్‌లైనా చూడడానికి బాగున్నాయి. మాటలు, పాటలు బాగున్నాయి. ఒక పాట ట్యూన్ తాజా హిందీ సినిమాలో ఉంది. అన్ని సినిమాల్లో లాగే హీరోయిన్ ఎక్కడ ఉంటుందో, ఆమె తరఫు వాళ్ళు ఎవరో తెలిస్తే ఒట్టు. అయినా దీనిని మంచి వినోదాత్మక చిత్రంగా చెప్పవచ్చు. రాజశేఖర్ మొదట్లో దీనిని లోబడ్జెట్ చిత్రంగా తీయాలనుకున్నా తర్వాత మనసు మార్చుకుని ఎక్కువ ఖర్చు చేసి ఉన్నంతలో రిచ్‌గా తీయడం వల్ల ఇది హిట్ చిత్రమైంది.


Click it and Unblock the Notifications











