For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అడవిచుక్క- ప్రేక్షకులకు కన్నీటిచుక్క

  By Staff
  |

  Adavi Chukka
  -సౌమిత్‌
  చిత్రం: అడవిచుక్క
  నటీనటులు: విజయశాంతి, సుమన్‌, చరణ్‌ రాజ్‌, ప్రకాష్‌ రాజ్‌, రామిరెడ్డి
  సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  కెమెరా: శ్రీనివాస రెడ్డి
  నిర్మాణం: సూరజ్‌ మూవీస్
  కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు

  బడుగు వర్గాల వారిని అణగదొక్కుతూ, వారి హక్కులను కాలరాచే జమిందారీ వ్యవస్థను ఎదిరించి పోరాడే ఓ గిరిజన యువతి కథను అడ్డదిడ్డంగా తీసిని చిత్రమే- అడవిచుక్క. ఒసేయ్‌....రాములమ్మ చిత్రం తర్వాత దాసరి, విజయశాంతి కాంబినేషన్‌ లో వచ్చిన చిత్రం కావడంతో అడవిచుక్కపై సహజంగానే క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఆ చిత్రానికి, దీనికి జమీన్‌, ఆస్మాన్‌ ఫరక్‌. అర్థంపర్థం లేని కథ, ఆకట్టుకోలేని కథనం కలిసి చిత్రం నానా కంగాళీగా తయారైంది.

  పోలీసు అధికారి చరణ్‌ రాజ్‌ భార్య శాంతి(విజయశాంతి). గుండా రామిరెడ్డిని చరణ్‌ రాజ్‌ ఎదిరిస్తాడు. దాంతో అతని అనుచరులు చరణ్‌ రాజ్‌ ఇంటిపై దాడిచేస్తారు. శాంతి వారిని ఎదుర్కొని చావగొడుతుంది. ఆమె కొట్టిన దెబ్బలు గతంలో అడవిచుక్క కొట్టిన దెబ్బలను పోలి ఉన్నాయని మరో పోలీసు అధికారి గిరిబాబు గమనిస్తాడు. ఈ విషయంలో చరణ్‌ రాజ్‌ ను నిలదీస్తాడు. దాంతో చరణ్‌ రాజ్‌ అడవిచుక్క గతాన్ని వివరిస్తాడు. ఫ్లాష్‌ బ్యాక్‌.....

  జమీందారు జయప్రకాష్‌ రెడ్డి కొడుకు జీవా. అతను పెళ్ళిచేసుకున్న నెలరోజుల్లో పెళ్ళికూతురు మరణిస్తుందని జ్యోతిష్యులు చెపుతాడు. దీంతో ఓ గిరిజన యువతిని పెళ్ళిచేసుకొని, ఆమెను చంపేస్తాడు. అక్క హత్యను కళ్ళారా చూసిన చుక్క(విజయశాంతి) జీవా బృందంపై బాంబుదాడి జరుపుతుంది. తప్పించుకున్నవాళ్ళు చుక్క వెంటపడడంతో పారిపోతుండగా ఓ గుంటలో పడి స్పృహ తప్పిపడిపోతుంద. అటుగా వచ్చిన ఓ గిరిజన తండా వారు ఆమెను పెంచి పెద్ద చేస్తారు. ఆ ప్రాంతానికి వచ్చిన ఫారెస్ట్‌ అధికారి సుమన్‌ గిరిజనులకు అండగా నిలబడి వారి హక్కుల్ని గుర్తుచేస్తాడు. అతన్ని చంపటానికి వచ్చిన జీవాను చుక్క చంపేస్తుంది.

  సుమన్‌ కు ట్రాన్స్‌ ఫర్‌ ఆర్డర్స్‌ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి చుక్కను పెళ్ళిచేసుకుంటాడు. పెళ్ళయిన రోజే సుమన్‌ ను చంపేస్తారు దొరలు. ఆ శవాన్ని తీసుకొని కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని అర్థిస్తారు గిరిజనులు. దొరలు వారి గూడెంపై దాడిచేసి సర్వనాశనం చేస్తారు. దాంతో చుక్క అడవిచుక్క గా మారి దొరల్ని పట్టి బంధిస్తుంది. అడవిచుక్కను పట్టుకోవడానికి వచ్చిన పోలీసు అధికారి చరణ్‌ రాజ్‌ ఆమె గతం విని దొరల్ని చంపమంటాడు. ఆ తర్వాత ఆమెను తీసుకొని పట్నానికి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అతను, అడవిచుక్క తప్ప అందరూ మరణిస్తారు. పోలీసులకు అప్పచెప్పితే ఆమెను చంపేస్తారని భావించినా చరణ్‌ అడవిచుక్కను పెళ్ళిచేసుకుంటాడు. ..ఫ్లాష్‌ బ్యాక్‌ ఓవర్‌...

  ఇక్కడికి కథ అయిపోయిందనుకుంటే పొరపాటే. బాంబుదాడిలో చావకుండా దొర జయప్రకాష్‌ రెడ్డి బతికి బయటపడుతాడు. అతను, రామిరెడ్డి, అవినీతీపరుడైన ఓ పోలీసు అధికారి అడవిచుక్క బతికే ఉందన్న నిజాన్ని బయటపెడుతారు. ఇక్కడి నుంచి కథను ఇంకా లాగి...లాగి..లాగి..నానా రకాలుగా, అడ్డదిడ్డంగా సాగదీసి ప్రేక్షకులను హింసించారు.

  మొదటి భాగం బాగానే తీసినా, ద్వితీయార్ధంలో అర్థంపర్థం లేని ట్విస్ట్‌ లు పెట్టి ప్రేక్షకులకు నరకాన్ని చూపించారు. విజయశాంతి నటన మినహా చిత్రంలో చెప్పుకోదగ్గ అంశమంటూ లేదు. దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాపై ఎంత 'శ్రద్ధ' కనబరచారో! ప్రతి అంశంలోనూ విఫలమయ్యారు. ఇక, సంగీతం గురించి చెప్పుకోవడం శుద్ద దండగ.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X