twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆది - అదే సీమ సోది

    By Staff
    |

    Aadi
    - జలపతి
    చిత్రం: ఆది
    నటీనటులు: ఎన్టీఆర్‌, కీర్తి చావ్లా, రాజన్‌, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్‌
    సంగీతం: మణిశర్మ
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌
    నిర్మాత: నాగమణి
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

    ఫ్యాక్షన్‌ నేఫథ్యంలో వచ్చే కథలకు ఇప్పట్లో ఫుల్‌ స్టాప్‌ లేదేమో! బాలకృష్ణ బాడీలాంగ్వేజ్‌ ఇలాంటి చిత్రాలకు బాగా సూట్‌ అవడంతో, ఎన్టీఆర్‌ కు కూడా నప్పుతుందని ఈ చిత్రం తీసి ఉంటారు. కానీ ఎన్టీఆర్‌ వయసు ఈ సినిమాకు ప్రధాన లోపం. చిన్నపిల్లాడి లాంటి ఆయన వాయిస్‌ ఇలాంటి పాత్రలకు సూటవ్వదు. అంతేకాకుండా, కథను మరీ సాగదీయడం, ద్వితీయార్థంలో పట్టు లేకపోవడం కూడా ఈ చిత్రాన్ని సాధారణంగా మలిచింది. కొత్త దర్శకుడు వినాయక్‌ టేకింగ్‌ స్టైల్‌ బాగున్నా, నటీనటుల మీద అతనికి గ్రిప్‌ లేకపోవడంతో సినిమా అతని చేయి దాటిపోయింది. షాట్‌ డివిజన్‌, కెమెరా యాంగిల్స్‌ అంతా వర్మ స్కూల్‌ స్టైల్‌ లో ఉన్నాయి.

    ఈ సినిమాలో రాంప్రసాద్‌ కెమెరా పనితనం వల్ల 'కొత్త లుక్‌' వచ్చింది. కానీ పరుచూరి బ్రదర్స్‌ పేలవమైన డైలాగ్స్‌, ఎన్టీఆర్‌ తన 'యూజువల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌' నుంచి బయటపడకపోవడంతో సినిమా పూర్తిగా దెబ్బతింది. రాయలసీమ కథ అంటే ఇలానే ఉంటుందని ఓ ట్రేడ్‌ మార్క్‌ లాగా కథను రూపొందించుకోవడంతో వెరైటీ కనిపించదు.

    ఆహూతి ప్రసాద్‌ అమెరికా నుంచి తిరిగివస్తాడు. తన భూములన్నింటిని పేదలకు పంచి ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ భూములు తన సొంతం కావాలని, రాజన్‌ ఆయన్ని, అతని భార్యను చంపేస్తాడు. వీరి కొడుకు ఆది(ఎన్టీఆర్‌)ను ఆయన అనుచరుడు చలపతిరావు తీసుకొని హైదరాబాద్‌ పారిపోతాడు. ఓ పన్నెండేళ్ళ తర్వాత ఈ ఆది, కీర్తి చావ్లా ప్రేమలో పడుతాడు. ఈ భామామణి ఎవరో కాదు రాజన్‌ కూతురు. దాంతో ఆమెను పెళ్ళి చేసుకుంటానని ఎన్టీఆర్‌ శపథం చేస్తాడు. అలాగే ఆ భూములను పేదలకు పంచేందుకు మళ్ళీ రాయలసీమకు వస్తాడు. రాజన్‌ ను చంపి, కీర్తిని పెళ్ళి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

    ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో పాత్రధారిగా కాకుండా, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ వారసుడిలాగా నటించడం విశేషం. మాటిమాటీకి తాతయ్య అంటూ ఎన్టీఆర్‌ ను పోల్చుకుంటూ, అలాగే చేసేందుకు ప్రయత్నించాడు. ఇక కీర్తిచావ్లా పాటలలో, అప్పుడప్పుడు మైక్రో షార్ట్స్‌ వేసుకొని కనువిందు చేయడం మినహా చేసిందేమీ లేదు. మలయాళం నటుడు రాజన్‌ విలనిజమ్‌ ఫర్వాలేదు. ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాల మాదిరిగానే ఉంది.

    మణిశర్మ సంగీతం మరీ సాధారణం. నీ నవ్వుల తెల్లదనం నాగమల్లి అడిగింది...అనే పాట మాత్రం బాగుంది. ఈ పాట చిత్రీకరణ కూడా చక్కగా ఉంది.. రాంప్రసాద్‌ కెమెరా పనితనం ఈ చిత్రానికి హైలెట్‌. రాయలసీమ గ్రానైట్‌ కొండలు, కర్నూలు గ్రామపరిసరాలను చిత్రీకరించిన విధానం బాగుంది. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ లో పంచ్‌ లేదు. కాలేజ్‌ సీన్స్‌ చిత్రీకరణ విషయంలో దర్శకుడు వినాయక్‌ ఇమెచ్యురిటీ కన్పించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X