twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుల దురదృష్టం!

    By Staff
    |

    Adrustham
    - జలపతి
    చిత్రం: అదృష్టం
    నటీనటులు: తరుణ్‌, రీమాసేన్‌, గజాలా, ఆషాశైనీ
    సంగీతం: దిన
    నిర్మాతలు: మన్సూర్‌ అహ్మద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజనాకుమార్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శేఖర్‌ సూరి

    స్టీవెన్‌ స్పీల్‌ బర్డ్‌ 'రోడ్‌' చిత్రాలు అనే ఒక కొత్త ప్రక్రియను పరిచయం చేశాడు. అదే పద్దతిలో తెలుగులో రాంగోపాల్‌ వర్మ అనగనగా ఒక రోజు, క్షణక్షణం, మణిరత్నం దొంగ..దొంగ చిత్రాలు తీశారు. మంచి టెక్నికల్‌ పద్దతిలో తీసిన ఆ చిత్రాలు పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలు. అదే పద్దతిలో మరో చిత్రం తీయాలనుకున్నప్పడు కనీసం వాటి రేంజ్‌ లోనైనా ఉండేలా చూసుకోవాలి.

    లేకపోతే, అదృష్టం చిత్రం మాదిరిగా బోర్‌ కొట్టడం తప్ప వినోదం ఉండదు. కొత్త దర్శకుడు శేఖర్‌ సూరి స్టైల్‌ గా తీయాలన్న తాపత్రయంలో సబ్‌ స్టెన్స్‌ మరిచిపోయాడు. ఫలితం - అతి సాధారణ చిత్రం. తరుణ్‌ కు అటు మాస్‌ ఇమేజ్‌ అందించాలన్న ప్రయత్నం ఒకటి, ఫోటోగ్రఫీతో జిమ్మిక్కుల చేయాలన్న తాపత్రయం కలిసి...సినిమా అంతా కలగాపులగంగా తయారైంది. ఈ సినిమా ద్వారా తరుణ్‌ ప్రేమకథలు చేసుకుంటేనే బెటర్‌ అని ప్రేక్షకులకు తెలిసిపోయింది.

    కథలో ఎక్కడా పట్టు లేకపోవడం...దర్శకుడి దృష్టి అంతా రోడ్‌ మీదే ఉండడంతో...ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఫస్ట్‌ హాఫ్‌ భరిస్తే గానీ సెకండ్‌ హాఫ్‌ లో సినిమా ఏమిటనేది తెలుస్తుంది. గజాలా రాజకుమార్తె. ఆమె వరుడి కోసం స్వయంవరం ప్రకటిస్తుంది. ఈ రోజుల్లో స్వయంవరం ఏమిటి అని అడగకూడదు. అది దర్శకుడి ఊహ. పెళ్ళి చేసుకుంటే జాతకం మారిపోతుందని నిరుద్యోగి అయిన తరుణ్‌ కు ఓ జ్యోతిష్కుడు చెపుతాడు. దాంతో స్వయంవరానికి తరుణ్‌ అటెండ్‌ అవుతాడు. స్వయంవరంలో గజాలాను చూడగానే తరుణ్‌ కు మనసు చెదిరిపోతుంది. వెంటనే ఆమెను ముద్దుపెట్టుకుంటాడు. షాక్‌ తిన్న గజాలా కుటంబం తరుణ్‌ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.

    కానీ మనవాడు తప్పించుకోని రోడ్‌ మీద పడుతాడు. ఇక పోలీసులు వెంటపడుతుంటారు. మరోవైపు పెళ్ళి నుంచి పారిపోయి వచ్చిన రీమాసేన్‌ తరుణ్‌ కు రోడ్‌ మీద పరిచయం అవుతుంది. పెళ్ళికొడుకు రీమా కోసం వస్తాడు. సో..తరుణ్‌, రీమా ఇద్దరూ కలిసి పారిపోతా..రు. పారిపోతూ..పారిపోతూనే...ప్రేమించుకుంటారు. పాటలు పాడుకుంటారు. పెళ్ళిచేసుకుందామని నిర్ణయించుకుంటారు. కానీ చపలచిత్తురాలైన రీమాసేన్‌, తరుణ్‌ గజాలాను రేప్‌ చేశాడని తెలుసుకొని అతని నుంచి కూడా పారిపోతుంది. చివరికి పోలీసులు తరుణ్‌ ను గజాలా వద్దకు చేరిస్తే...ఆమె మనసు మార్చుకొని పెళ్ళి చేసుకుంటుంది. ఇదీ కథ.

    తరుణ్‌ రఫ్‌ గడ్డంతో అందంగానే కనిపించినా, నటనలో మార్పు ఏమీ లేదు. నోట్లోకి ఈగలు దూరుతాయన్నట్లుగా మాటిమాటికీ మూతి మూసుకోవడం ఎందుకో అర్థం కాదు. ఏ సినిమాలోనైనా జుట్టు పైకొనుకోవడం, మూతిమూసుకోవడం ఏమిటో? రీమాసేన్‌ నటన బాగుంది. బాగా చేసింది. రీమా ప్రేమికుడు సిజ్జు జుట్టుకు కలర్‌ పూయడంలో మర్మం ఏమిటో కూడా అర్థం కాదు. ఆ పాత్రే ఒక అర్థం లేని పాత్ర. ఇక గజాలా రాజకుమారి పాత్రలో చేసేది ఏమీ లేదు. అత్తమ్మ, పిన్ని..ఇలా టీవీ సీరియల్స్‌ లో తిరుగులేని సంగీతదర్శకుడిగా పేరుపొందిన దినకు ఇది తొలి చిత్రం. ఒక్క పాట మినహా వినదగ్గ సంగీతం అందించలేకపోయాడు. బహుశా టీవీ సీరియల్‌ లో మాదిరిగా ఒక్క పాట బాగుంటే చాలు అనుకున్నాడేమో!

    శ్యాం.కె.నాయుడు ఫోటోగ్రపీ ఒక్కటే ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌. చేసింగ్‌ దృశ్యాలు, ఏరియల్‌ షాట్స్‌ చాలా చక్కగా చిత్రీకరించాడు. కాకపోతే, అవసరం లేనప్పుడు కూడా 'వంకర్లు' పోయాడు. కొత్త దర్శకుడు శేఖర్‌ సూరి సినిమా విడుదలకు ముందు చాలానే కోతలు కోశాడు. సినిమాల్లో ప్రతిభ చూపించుకోకుండా బయట ఏమి మాట్లాడితే ఏమి లాభం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X