Agent Review మాస్, యాక్షన్‌తో ఆకట్టుకొన్న అఖిల్.. ఎక్కడ మిస్ అయ్యారంటే?
నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మారియా, సంపత్ రాజ్, మురళీ శర్మ, ఊర్వశి రౌటేలా తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
స్టోరి: వక్కంతం వంశీ
నిర్మాతలు: రామబ్రహ్మం, అజయ్ సుంకర, సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫి: రసూల్ ఎల్లోర్, జార్జి సీ విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలీ
సంగీతం: హిప్‌హాప్ తమీజా
బ్యానర్స్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2023-04-28
ఏజెంట్ కథ ఏమిటంటే?: దేశ భద్రతను కాపాడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఏజెంట్‌గా పనిచేయాలని రామకృష్ణ అలియాస్ రిక్కి (అఖిల్ అక్కినేని) కలలు కంటాడు. రా చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టి)ని తన గురువుగా భావిస్తుంటాడు. దూకుడుతనం, చంచలత్వం కారణంగా పలుమార్లు రా సంస్థలో ఉద్యోగానికి రిజెక్ట్ అవుతాడు. దేశాన్ని సర్వనాశనం చేయాలనుకొంటున్న ధర్మ అలియాస్ గాడ్ (డినో మారియా) దుష్ట ప్రయత్నాలను అడ్డుకోవడానికి మహాదేవ్ ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎథికల్ హ్యాకర్ అంటూ తారసపడిన రిక్కినీ మహాదేవ్ రా ఏజెంట్‌గా నియమిస్తాడు.

ఏజెంట్ సినిమాలో ట్విస్టులు: రిక్కీ ఎందుకు ఎథికల్ హ్యాకర్‌గా మారాడు? రిక్కి ఎందుకు రా సంస్థలో చేరాలనుకొన్నాడు? మహదేవ్‌ను ఎందుకు గురువుగా భావిస్తాడు? ధర్మ ఎందుకు గాడ్ అవతారం ఎత్తాడు? తాను ప్రాణంగా ప్రేమించే ప్రియురాలు (సాక్షి వైద్య)ను ఏ కారణంగా వదిలేస్తాడు? కేంద్ర మంత్రి జై కిషన్ (సంపత్ రాజ్), అతడి కుమారుడిని ఎందుకు రిక్కీ చంపాడు? తాను గురువుగా భావించే మహాదేవ్‌ను రిక్కీ ఎందుకు చంపాడు? చివరకు గాడ్ దుష్ట ప్రయత్నాలను రిక్కీ ఎలా అడ్డుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏజెంట్ సినిమా కథ.

ఏజెంట్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే:ఏజెంట్ చిత్రం మహాదేవ్‌ను రిక్కీ కాల్చి చంపాడనే ఒక ఎమోషనల్ పాయింట్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సన్నివేశాలతో అఖిల్ ఎంట్రీని మాస్ రేంజ్‌లో ఓపెన్ చేస్తారు. అయితే రిక్కీ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రెగ్యులర్, రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక సాక్షి వైద్యతో లవ్ ట్రాక్ కూడా చాలా రొటీన్‌గా ఉండటంతో కొత్త ఫీల్ ఎక్కడా కనిపించదు. ఫస్టాఫ్‌లో కేంద్ర మంత్రి జై కిషన్‌కు వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ సూపర్‌గా ఉంటుంది. అలాంటి పవర్‌పుల్ ఎపిసోడ్ తర్వాత వెంటనే ఏ మాత్రం ఆకట్టుకొని పాటను తెచ్చి ప్రేక్షకుడి ఉత్సాహాన్ని నీరుగార్చారనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడంతో సెకండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. :ధర్మ అలియాస్ గాడ్ ఎందుకు రా వ్యవస్థపై తిరుగుబాటు చేశాడనే ప్రశ్నకు సమాధానంగా ఫ్లాష్ బ్యాక్‌ను ఓపెన్ చేస్తారు. కానీ ఆ పాయింట్ పెద్దగా కన్విన్సింగ్‌గా అనిపించదు. అలాగే రిక్కీ తాను ఎందుకు ఏజెంట్‌గా ఎందుకు మారాలని అనుకొన్నాడనే పాయింట్ బలంగా కనిపించదు. క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ యాక్షన్ సీన్లు, మమ్ముట్టి ఫెర్పార్మెన్స్, అఖిల్ పవర్ ఫుల్ ఫైట్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ప్రేక్షకుడిని కొత్త లోకంలోకి తీసుకెళ్లే స్పై థ్రిల్లర్‌గా అనిపించవు. పాటలు చాలా రాంగ్ ప్లేస్ మెంట్ అనిపిస్తాయి.

దర్శకుడి టేకింగ్, మేకింగ్:దర్శకుడు సురేందర్ రెడ్డి డిజైన్ చేసుకొన్న యాక్షన్ ఎపిసోడ్స్, సీక్వెన్స్‌లు బాగున్నాయి. కానీ వాటి మధ్య బలమైన కథను, మంచి లవ్ ట్రాక్‌ను జొప్పించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఛేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగా తెరకెక్కించారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలో ఇలాంటి యాక్షన్ డ్రామా రాలేదనే చెప్పాలి. కథ, కథనాలపై దర్శకుడు కాస్త దృష్టి పెట్టి ఉంటే బెటర్ స్పై థ్రిల్లర్ అయి ఉండేది. షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా లేటుగా రావడం.. ఆ లోపే పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కాస్త ఈ సినిమాకు ఇబ్బందికరమే అని చెప్పవచ్చు
అఖిల్, సాక్షి వైద్య పెర్ఫార్మెన్స్:ఏజెంట్ సినిమా అఖిల్‌కు ప్రమోషన్ లాంటిదే. తన పాత్ర వరకు అఖిల్ పడ్డ కష్టం ప్రతీ సీన్‌లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్‌కు దూరంగా ఏజెంట్ పాత్ర ఉంటుంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలీవరి, డ్యాన్సులతో ఆకట్టుకొన్నాడు. మాస్, యాక్షన్ హీరోగా నూటికి నూరు మార్కులు వేసుకొన్నాడనే చెప్పాలి. అఖిల్ తన పరంగా ఎక్కడా పాత్ర పరంగా తగ్గలేదని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ సాక్షి వైద్యకు పెద్దగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రే. కాకపోతే గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది.

ఇతర నటీనటుల గురించి:ఏజెంట్‌లో మిగితా పాత్రల విషయానికి వస్తే.. మమ్ముట్టి పాత్రదే డామినేషన్ కనిపిస్తుంది. ఆయన తన పాత్రతో రిజిస్టర్ అయ్యాడనిపిస్తుంది కానీ.. ఆయన స్థాయికి మించిన పాత్ర కాదని చెప్పవచ్చు. ఒకే రకంగా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన యాక్టింగ్ మోనాటనస్‌గా అనిపిస్తుంది. డినో మారియా మంచి పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్ర పరిధి మేరకు మంచిగా ఫెర్ఫార్మ్ చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఏ మాత్రం ప్రాధాన్యంలేని పాత్రలో ఓ బొమ్మలా కనిపించారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ టీమ్ గురించి:ఏజెంట్ సినిమాలో సౌండ్ అన్ని విభాగాల కంటే బెటర్‌గా ఉంది. పలు సన్నివేశాలు కేవలం సౌండ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగానే ఎలివేట్ అయ్యాయి. పాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ ఒకే అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫి అందించిన రసూల్ ఎల్లోర్ పనితనం బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అనుకొన్న స్థాయిలో లేవు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే? :సాధారణంగా యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌లో కథను ఆశించడం తప్పే అవుతుంది. కానీ కొంతైనా ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేసే ఎమోషనల్ కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ లేకపోవడం వల్ల కేవలం యాక్షన్ డ్రామా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలు రొటీన్‌గా ఉండటం వల్ల మంచి యాక్షన్ డ్రామాకు గుర్తింపు లేకుండా పోయిందనే అభిప్రాయం కలుగుతుంది. మాస్, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సంప్రదాయ ప్రేక్షకులు పెదవి విరిచే అవకాశం ఉంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బాక్సాఫీస్ జర్నీ ఎలా ఉంటుందో తొలివారం ఆగితే గానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











